‘పది’పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి

పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు.

Update: 2023-12-22 10:24 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు. ప్రతి విద్యార్థికి అర్ధమయ్యే రీతిలో, వారు ఆకళింపు చేసుకునేలా నాణ్యమైన బోధన అందించాలని అన్నారు. పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, ఉన్నతి లక్ష్యం తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, మండల నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. టెన్త్ విద్యార్థులు తమ సామర్ధ్యాలను మెరుగుపర్చుకునేలా ప్రతి విద్యార్థి వారీగా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.

    ఫలితాలలో జిల్లాను ముందంజలో నిలపాలన్నారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తిస్తూ, అలాంటి వారిపట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ముఖ్యంగా ఆంగ్లం, గణితం, సామాన్య శాస్త్రం సబ్జెక్టులలో విద్యార్థుల సామర్ధ్యాలను గమనిస్తూ, ప్రతిఒక్కరూ వార్షిక పరీక్షలను సమర్ధవంతంగా ఎదుర్కొని అత్యుత్తమ మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని, ఈ మేరకు ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గట్టి పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ హితవు పలికారు. వార్షిక పరీక్షలకు మరో మూడు నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నందున ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ నాణ్యమైన విద్యను బోధించేలా చొరవ చూపాలన్నారు. విద్యార్థుల కాపీయింగ్ వంటి వాటిపై ఆధారపడకుండా, తమ స్వశక్తితో పరీక్షలు రాసి ఉత్తమ మార్కులు సాధించేలా వారిని సన్నద్ధం చేయాలన్నారు.

    విద్యార్థుల్లో సామర్ధ్యాలను పెంపొందిస్తే, వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దోహదపడుతుందన్నారు. కాగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం కలుషితం కాకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, నిర్దేశిత మెనూ ప్రకారంగా పోషక విలువలు, నాణ్యతతో కూడిన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఒక్క పాఠశాలలోనూ మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థుల అస్వస్థతకు గురైన సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ పథకాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని హితవు పలికారు. పాఠశాలల్లో నీటి వసతి, విద్యుత్ వంటి వసతులు కొరవడితే వెంటనే తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్వీ దుర్గాప్రసాద్, జీసీడీఓ వనిత, ఏసీఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News