బియ్యం స్మగ్లింగ్.. బాన్సువాడ కేంద్రంగా అడ్డా.. మత్తులో సివిల్ సప్లై శాఖ
అక్రమాల ఊడల్లో.. అవినీతి పర్వంలో.. నిర్లక్ష్యపు నీడలో బియ్యం స్మగ్లింగ్ దందా జోరుగా సాగుతోంది.
దిశ, బాన్సువాడ: అక్రమాల ఊడల్లో.. అవినీతి పర్వంలో.. నిర్లక్ష్యపు నీడలో బియ్యం స్మగ్లింగ్ దందా జోరుగా సాగుతోంది. రేషన్ డీలర్ల చేతివాటం.. దళారుల దగా.. రైస్ మిల్లర్ల దోపిడీ.. వ్యాపారుల అక్రమాలు.. అధికారుల అవినీతి.. ప్రజా ప్రతినిధుల అలసత్వం.. లబ్ధిదారుల అమాయకత్వం కలగలసి రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు అక్రమార్కులు బియ్యం రీసైక్లింగ్ దందా పంచుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటించి అందినంత దోచుకుంటున్నారు. అక్రమార్కులకు లీడర్ల వత్తాసుపలుకుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కన్నేసిన అక్రమార్కులు..
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 7.80 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. దాదాపు 3,900 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. కరోనా సమయం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా మరో ఐదు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇక్కడే అక్రమార్కులు కన్నేశారు. బియ్యం స్మగ్లింగ్ పై పావులు కదిపారు. రేషన్ డీలర్లతో కుమ్మక్కయ్యారు. ప్రతి రేషన్ డీలర్ పరిధిలో దళారులను పెట్టారు. లబ్ధిదారుల అమాయకత్వం, అవసరాలు ఆసరాగా తీసుకుని బియ్యం సేకరణకు దిగారు. రీసైక్లింగ్ దందాకు పాల్పడుతున్నారు. అంతరాష్ట్ర స్మగ్లింగ్‌కు తెరలేపారు. సరిహద్దు ప్రాంతాలే కేంద్రంగా పావులు కదుపుతున్నారు.
డీలర్లతో ఒప్పందం..
రేషన్ డీలర్లతో ఒప్పందం మేరకు బియ్యాన్ని వ్యాపారులకు, మిల్లర్లకు పంపిస్తున్నారు. మరోవైపు అక్రమార్కులు ఏర్పాటు చేసుకున్న దళారులు రేషన్ బియ్యం దొడ్డిదారిన సేకరిస్తున్నారు. లబ్ధిదారుల పరిచయాలతో తక్కువ ధరతో నేరుగా కొనేయడం లేదంటే అటుకులు, పేలాలు, పుట్నాలు పేరిట వస్తు మార్పిడి పద్ధతిలో తీసుకోవడం చేస్తున్నారు. అంటే డబ్బులతో సంబంధం లేకుండా రేషన్ బియ్యం తీసుకుని అటుకులు, పేలాలు, పుట్నాలు ఇస్తున్నారు. పేదల అవసరం, అమాయకత్వంతో స్మగ్లింగ్ కు కావాల్సిన బియ్యం సేకరణ గ్రామ, పట్టణాల్లో సులువుగా జరుగుతోంది.
దొడ్డిదారులెన్నో..
అక్రమంగా సేకరించిన బియ్యాన్ని డీలర్లు, దళారులు మిల్లర్లకు, వ్యాపారులకు కమీషన్ లెక్కన ఇస్తున్నారు. అందినంత సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ అక్రమాల కోణం మారుతోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్ చేసి, మళ్ళీ ప్రభుత్వానికి లేవి కింద ఇస్తున్నారు. పాలిష్ అయిన ఈ బియ్యం తిరిగి రేషన్ దుకాణాలకే చేరేలా చూస్తున్నారు. వ్యాపారులేమో అధిక ధరలకు పక్క రాష్ట్రాల్లో అమ్మేస్తున్నారు. అయినకాడికి దండుకుంటున్నారు. పలుసార్లు బియ్యం పాలిష్ కావడంతో సన్న బియ్యంగా మారుతున్నాయి. ఇవేమీ తెలియని లబ్ధిదారులు తమకు సన్నబియ్యం ఇచ్చారని సంబర పడటం విశేషం.
బాన్సువాడనే ఎందుకంటే..
బియ్యం స్మగ్లింగ్‌కు బాన్సువాడ అడ్డాగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విభజన జరిగాక కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు బాన్సువాడ సరిహద్దుగా అయింది. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు అతి దగ్గరగా ఉంది. ఎవరి కన్ను ఇక్కడ పడదనే భావన లేకపోలేదు. అందుకే బియ్యం స్మగ్లర్లు బాన్సువాడను అక్రమాల కేంద్రంగా ఎన్నుకున్నారు. పక్కనున్న బోధన్ రైస్ మిల్లర్లు సైతం అక్కడ సేకరించిన సబ్సిడీ బియ్యాన్ని బాన్సువాడ ప్రాంతానికే తరలిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా, స్థానిక రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేస్తున్నారు. లేవి బియ్యం కింద మారుస్తున్నారు. చెక్ పోస్టుల కళ్లుగప్పి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కోటగిరి, మద్నూర్, జుక్కల్, బోధన్ మండలాల మీదుగా సరిహద్దులు దాటిస్తున్నారు. మహారాష్ట్రలోని ఓ లిక్కర్ కంపెనీకి చేరవేస్తున్నారు. అక్కడ అధిక ధరలు పొందుతూ.. అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
అందరూ దొంగలే..
బియ్యం స్మగ్లింగ్‌లో అందరూ దొంగలే అన్నట్టుంది వ్యవహారం. అక్రమ దందా అని తెలిసినా అధికారులు లంచాల మత్తులో పట్టించుకోవడం లేదు. ప్రజా ప్రతినిధులు చందాల, ప్రలోబాల పర్వంలో దొంగలకు వత్తాసు పలకడం విశేషం. దీంతో ఆకస్మిక తనిఖీలు కరువయ్యాయి. పర్యవేక్షణ కొరవడింది. నిఘా లోపించింది. అజమాయిషీ లేకుండా పోయింది. స్మగ్లర్లు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. దాదాపు బహిరంగంగా నల్ల బజారు వ్యాపారం చేస్తున్నారు. ఎవరిని లెక్క చేయడం లేదు. కాగితాలపై రైస్ మిల్లులు చూపించి లేవి పేరుతో అనుమతులు పొంది, రేషన్ బియ్యం స్వాహా చేయడం చూస్తే రైస్ స్మగ్లింగ్ ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. అధికారులు నామమాత్రపు కేసుల కోసం, స్మగ్లింగ్ విభేదాలతో కేసులు నమోదైనవి చూస్తేనే, బియ్యం దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాక్షాలివిగో..
ఈ నెల 18న పీడీఎస్ బియ్యం నిజామాబాద్ నగరంలోని అహమ్మద్ పూర కాలనీలో పోలీసులు పట్టుకున్నారు. అజ్ఞాత వ్యక్తుల సమాచారం మేరకు అక్రమ బియ్యం రవాణా వాహనం పట్టుబడటం విశేషం.
* బిక్నూర్ మండలంలోని పెద్ద మల్లారెడ్డిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం వాహనాన్ని ఎస్ఐ ఆనంద్ పట్టుకున్నారు. వాహనం స్వాధీనం చేసుకుని సంబంధిత రైస్ మిల్లర్లయిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
* వారం రోజుల క్రితం వర్ని మండల కేంద్రంలో దొడ్డిదారిలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్పెషల్ పార్టీ పోలీసులు పట్టుకొని, వాహనం స్వాధీనం చేసుకున్నారు.
* బిచ్కుంద మండల కేంద్రంలో పోలీసులు అక్రమ బియ్యం తరలింపును అడ్డుకొని, 26సంచుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
* మూడు నెలల క్రితం కోటగిరి మండల పరిధిలో తహసీల్దార్ దాడులు జరిపి, 20క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు.