ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా అయ్యప్ప వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్

ఆర్మూర్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆర్మూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో మొదలైన రాజకీయ అలజడి ఎట్టకేలకు దాదాపు నాలుగు నెలల తర్వాత గురువారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఒక కొలిక్కి వచ్చింది.

Update: 2024-03-21 09:56 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆర్మూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో మొదలైన రాజకీయ అలజడి ఎట్టకేలకు దాదాపు నాలుగు నెలల తర్వాత గురువారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఒక కొలిక్కి వచ్చింది. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ 23 వార్డ్ కౌన్సిలర్ వన్నెల్ దేవి అయ్యప్ప లావణ్య శ్రీనివాస్ ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఆర్మూర్ మున్సిపల్ లో 36 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉండగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. కాగా ఆర్మూర్ ఆర్డీఓ రాజా గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు చైర్ పర్సన్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి 30 మంది మున్సిపల్ కౌన్సిలర్లు హాజరు కాగా తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్,

    ఐదుగురు బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. చైర్ పర్సన్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మెజారిటీ మున్సిపల్ కౌన్సిలర్లు 23వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అయ్యప్ప వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. మున్సిపల్ లో ప్రత్యేక సమావేశానికి ముందు జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ గదిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డిల సమక్షంలో మున్సిపల్ కౌన్సిలర్ల నిర్ణయం తెలుసుకునేందుకు సంగీత శ్రీనివాస్, లావణ్య శ్రీనివాస్ ల మధ్య ఓటింగ్ నిర్వహించి, ఆ ఫలితాన్ని మున్సిపల్ కౌన్సిలర్లకు తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ల ఓటింగ్ పై, కాంగ్రెస్ పెద్దలు తెలిపిన కౌన్సిలర్ల అంగీకార నిర్ణయాన్ని వివరించారు. తర్వాత ఆర్మూర్ మున్సిపల్ లో ప్రత్యేక సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ గా అయ్యప్ప వన్నెల దేవి లావణ్య శ్రీనివాస్ ను

    మున్సిపల్ కౌన్సిలర్ల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి రాజకీయ చతురతతో పంతం పట్టి సుమారు 9 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత ఆర్మూర్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. అనంతరం సమావేశపు గదిలో ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ కుర్చీపై అయ్యప్ప వన్నెల దేవి లావణ్య శ్రీనివాస్ ను కూర్చుండబెట్టి ఆర్డీఓ రాజా గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజులు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ఆర్మూర్ మున్సిపల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని, ప్రజల అభివృద్ధికి అహర్నిశలు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. సుమారు నాలుగు నెలలుగా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లేక అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందని, ఇక మీదట అభివృద్ధి పథంలో ఆర్మూర్ మున్సిపల్ ని తీసుకెళ్తానన్నారు. తనకు చైర్ పర్సన్ పదవి దక్కేందుకు సహకారం అందించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి లకు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


Similar News