మహాలక్ష్మి పథకంతో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు..

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Update: 2023-12-18 09:06 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న వేలాది మంది ఆటో డ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారాయని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్లు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బచ్చల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్ల పొట్ట కొడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు ఆటో నడుపుకుంటూ వచ్చే ఆదాయంతో తమ కుటుంబాలను పోషించుకుంటూ స్వయం ఉపాధి పొందేవారమని అన్నారు.

కానీ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవ్వడం వలన మహిళలు ఆటోలు ఎక్కడం లేదని దీంతో తాము ఉపాధి కోల్పోయి తమ కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రవేశ పెట్టడానికి ముందు తాము ప్రతిరోజు 500 పై చిలుకు ఆదాయంతో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే వాళ్ళమని తెలిపారు. కానీ ప్రస్తుతం రోజంతా తిప్పితే కేవలం 100 నుంచి 200 తో ఇంటికి వెళుతున్నామన్నారు. దీనివల్ల తమ కుటుంబాలకు కనీసం రెండు పూటలా తిండి కూడా పెట్టలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని అదేవిధంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అర్హత కలిగిన వారిని ఆర్టీసీ డ్రైవర్లు, హెల్పర్లుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అబ్దుల్ గఫార్, సాయిలు, షేక్ అబ్దుల్ జబ్బర్ నాతోపాటు ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News