Arrest : తప్పుడు డాక్యుమెంట్లతో ఫ్లాట్ కబ్జాకు పాల్పడిన వ్యక్తుల అరెస్ట్

అనారోగ్య కారణంతో ఒకరు మృతి చెందగా వారి వారసులుగా ఓ వ్యక్తిని చూపించి తప్పుడు పత్రాలు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి మోసానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరపరిచినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి శనివారం పేర్కొన్నారు.

Update: 2024-07-20 15:22 GMT

దిశ, కామారెడ్డి క్రైమ్ : అనారోగ్య కారణంతో ఒకరు మృతి చెందగా వారి వారసులుగా ఓ వ్యక్తిని చూపించి తప్పుడు పత్రాలు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి మోసానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరపరిచినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ లో ఉన్న 200 గజాల ప్లాటుకు సంబంధించి, దాని యజమాని అయిన కలిమెళ్ళ రాజయ్య అనే వ్యక్తి 2002లో కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అతను అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. అయితే 2015 వ సంవత్సరంలో కామారెడ్డి వీక్లీ మార్కెట్ కి చెందిన మారం శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆ ఫ్లాట్ పైన కన్ను వేసి, ఎలాగైనా ఆ ప్లాటును తన సొంతం చేసుకోవాలనుకున్నాడు.

ఆ ప్లాట్ ఓనర్ అయిన రాజయ్య కుమారుడు కలిమెలా మహేందర్ ఉన్నట్లుగా గుర్తించి, వారికి ఎవరికీ తెలియకుండా వీక్లీ మార్కెట్ కి చెందిన ఆరేటి గంగాధర్ అనే వ్యక్తిని మహేందర్ లాగా చూపించారు. మహేందర్ తండ్రి రాజయ్య చనిపోయిన తర్వాత ఆ ప్లాట్ కి మహేందర్ వారసత్వంగా యజమాని అని తప్పుడు డాక్యుమెంట్ చూపించి, ఆ మహేందర్ ప్లేస్ లో ఆరేటి గంగాధర్ ను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి తీసుకెళ్లి ఆ ప్లాటును మారం శ్రీనివాస్ దొంగతనముగా తన పేరు మీద మార్చుకున్నాడు.

ఆ తదుపరి ఆ ప్లాట్ ను కామారెడ్డి పట్టణంలోనే ఉన్న వేరొక వ్యక్తికి అమ్మివేశాడు.

ఈ విషయం తెలియని కలిమెల మహేందర్ తన తండ్రి కొనుగోలు చేసిన ప్లాటు వద్దకు వచ్చి చూడగా, అది వేరే వారి స్వాధీనంలో ఉండడాన్ని గమనించి, వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని అందుకు బాధ్యులైన మారం శ్రీనివాసు, ఆరేటి గంగాధరు లను ఈరోజు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరిగిందన్నారు. అదేవిధంగా దీనికి కారకులైన మరెవరైనా ఉంటే కూడా విచారణ అనంతరం వారి పైన కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొనబడతాయని ఆయన పేర్కొన్నారు.

అలాగే కామారెడ్డి పట్టణ ప్రజలకు, ప్లాట్లు కొనుగోలు చేసే వ్యక్తులకు ముఖ్యమైన గమనిక ఏమనగా, మీరు ఏదైనా స్థలాన్ని గాని, ఇంటిని గాని కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా పూర్వాపరాలను పరిశీలించిన పిదపనే కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసి ఇతరుల యొక్క ప్లాట్లను, స్థలాలను కబ్జా చేసి, దొంగ డాక్యుమెంట్లను క్రియేట్ చేసిన ఎడల వారి పైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.


Similar News