ఆర్మూర్ పట్టణం అభివృద్ధికి నిలువుటద్దం : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆర్మూర్ పట్టణం అభివృద్ధికి నిలువుటద్దమని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.

Update: 2023-05-08 12:46 GMT

దిశ ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణం అభివృద్ధికి నిలువుటద్దమని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లతో ఆర్మూర్ పట్టణ అభివృద్ధి పనులపై విడివిడిగా మొత్తం 36 వార్డుల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ అభివృద్ధిపై కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేశారు. ఆర్మూర్ పట్టణం గత పాలకుల హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదన్నారు. గత తొమ్మిదేళ్లుగా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతూ ప్రగతికి చిరునామాగా మారిందన్నారు.

పరిశుభ్రత, పచ్చదనంతో పట్టణం కొత్త అందాలను సంతరించుకుందని అన్నారు. తొమ్మిదికి పైగా నిర్మించిన బైపాస్ రోడ్లు ఆర్మూర్ ప్రగతికి సోపానాలుగా మారాయని అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ దయ వల్లే ఆర్మూరుకు వంద పడకల ఆసుపత్రి వచ్చిందన్నారు. పెర్కిట్ చెరువు, రెడ్డి చెరువుల్లో కాలుష్యా నివారణ పనులు, మోడ్రన్ ధోబీ ఘాట్, గుండ్ల చెరువు టూరిజం అభివృద్ధి పనులు, వెజ్-నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు, రూ.కోట్లతో ఆర్మూర్ పట్టణంలో సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు, ఆలూరు, ఆర్టీసీ బైపాస్ రోడ్లు, అంబేద్కర్ చౌరస్తా అందాలు, డివైడర్లు, అన్ని కుల సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు, ఆర్మూర్ పట్టణమంతా రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాల గురించి ఆయన సమీక్షా సమావేశంలో ప్రస్తావించారు.

వార్డుల్లో ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువాలని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని కౌన్సిలర్లకు సూచించారు. కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు గడప గడపకూ వెళ్లి అభివృద్ధిపై ప్రచారం చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు మనదే అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వినితా పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్ను భాయ్, కౌన్సిలర్లతో పాటు ఆర్మూర్ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు పూజ నరేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News