సెకండ్ ఫేజ్ లోనైనా నామినేటెడ్ పోస్టులు దక్కేనా...?

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులకు, ఆ పదవి దక్కుతుందా లేదా...? అన్న టెన్షన్ నెలకొంది.

Update: 2024-07-11 16:13 GMT

దిశ, భిక్కనూరు : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులకు, ఆ పదవి దక్కుతుందా లేదా...? అన్న టెన్షన్ నెలకొంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, పార్టీ విధేయులను గుర్తించి ఈ మధ్యనే 30 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఫస్ట్ పేజ్ లో కామారెడ్డి జిల్లా నుంచి కాసుల బాలరాజుకు ఒక్కరికి మాత్రమే నామినేటెడ్ పదవి దక్కగా, పార్టీనే నమ్ముకొని అధికారంలో ఉన్నా లేకున్నా.. పార్టీని వీడకుండా అంటిపెట్టుకొని కష్టపడి పని చేస్తున్నా సీనియర్ నేతలు కొందరిలో మాత్రం టెన్షన్ నెలకొంది. నామినేటెడ్ పదవి కోసం ఎన్నో ఏళ్లుగా ఆశ పడుతున్న నాయకులు మాత్రం, తమకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ పార్టీని మాత్రం వీడలేదని, అటువంటి సిన్సియర్ నాయకులను పార్టీ హైకమాండ్ గుర్తిస్తుందన్న నమ్మకంతో ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటికే జిల్లాకు చెందిన కొందరు నాయకులు బయోడేటాను కూడా అందజేశారు. పక్షం 20 రోజులలో సెకండ్ ఫేజ్ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనుందని తెలియడంతో ఆశావాహులు పార్టీ పెద్దల ఆశీర్వాదం పొందేందుకు హైదరాబాద్ కు చక్కర్లు కొడుతున్నారు. కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ న్యాయవాది దేవరాజ్ గౌడ్, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు, మహిళా విభాగం అధ్యక్షురాలు బల్యాల రేఖ సుదర్శన్ లు నామినేటెడ్ పదవుల రేసులో ఉన్నారు.

జిల్లాలోని బాన్సువాడ చెందిన కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి దక్కగా, నిజామాబాద్ జిల్లాకు ఫస్ట్ ఫేజ్ లో రెండు దక్కాయి. ఇంకో రెండు నామినేటెడ్ పోస్టులు కామారెడ్డి జిల్లాకు దక్కనున్నాయని సమాచారం అందడంతో, నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న సీనియర్ ముఖ్యనాయకులు కొందరు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీని కలసి వస్తున్నారు. రాష్ట్రస్థాయి పోస్టులతో పాటు, జిల్లా స్థాయిలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ తో పాటు, జిల్లాలో ఉన్న పది మార్కెట్ కమిటీ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమించనుంది. ఇప్పటికే ఆయా పాలకవర్గాలకు సంబంధించి, నాయకులతో జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు సమావేశమై, కార్యకర్తలు నాయకుల అభీష్టం మేరకు చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యుల వివరాల జాబితాను తయారు చేసి పార్టీ అధిష్టానానికి పంపించారు.

పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువే..

జిల్లాకు ఒకటి రెండు మాత్రమే రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టులు దక్కనుండగా, ఆశావాహుల మధ్య పోటీ మాత్రం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. నామినేటెడ్ పదవిని ఆశిస్తున్న ఆరేడుగురు మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ తమ ప్రయత్నాలను ఎవరికి వారుగా కొనసాగిస్తున్నారు. అయితే వైశ్య సామాజిక వర్గానికి చెందిన, పార్టీ సీనియర్ నాయకులు కైలాస్ శ్రీనివాసరావుకు లేదా బద్దం ఇంద్రకరణ్ రెడ్డిలలో ఎవరికో ఒకరికి నామినేటెడ్ పదవి దక్కడం ఖాయమని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.


Similar News