అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-11-02 14:49 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోళ్ల పై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా, ధాన్యం సేకరణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డీ.ఎస్.చౌహన్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం సేకరణ జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు.

ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని గుర్తు చేశారు. సన్నరకం ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ధాన్యం శుభ్రపరిచే ప్యాడీ క్లీనర్లు, కాలిపర్స్ ఇతర సామాగ్రి వెంటనే యుద్ద ప్రాతిపదికన సమకూర్చాలని అన్నారు. దొడ్డు రకం ధాన్యం సన్న రకం ధాన్యంతో కలువకుండా చూడాలని, సన్న రకం కొనుగోలు కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు రకం ధాన్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

తాలు, తప్ప పేరుతో రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలలో కోతలు అమలు చేయకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే కాంటా చేయాలని, రైతులకు ఎటువంటి నష్టం కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చేలా వారికి అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని మంత్రి సూచించారు. జిల్లాలోని రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు కోసం బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని, వీటిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు.

రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వ ఉత్తర్వులు 27 పై చర్చించాలని, రైస్ మిల్లర్లచే బ్యాంక్ గ్యారంటీ తీసుకుని ధాన్యం కేటాయింపు చేయవచ్చని అన్నారు. రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ సమర్పించని పక్షంలో జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం భద్రపరిచేందుకు అవసరమైన మేర ఇంటర్మీడియట్ గోడౌన్లను ముందస్తుగానే గుర్తించాలని, ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక ఫోన్ నెంబర్ తో కూడిన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపు చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. పక్క రాష్ట్రాల ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా సరిహద్దు ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యిందని, అవసరమైన అన్ని ప్రాంతాల్లో రైతులకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యిందని, జిల్లాలో 90 మిల్లులు అండర్ టేకింగ్ ఇచ్చాయని మంత్రి దృష్టికి తేగా, కలెక్టర్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇదే తరహా చొరవ చూపుతూ ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తిస్థాయిలో విజయవంతంగా జరిపించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం రమేష్, డీసీఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి గంగవ్వ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News