అవే రేట్లు.. అమలు కాని తగ్గించిన ధరలు
జిల్లాలో 141 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 28బార్‌లు ఉన్నాయి. ప్రతి రోజు రెండు కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా
మద్యం ప్రియుల ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రభుత్వం తగ్గించిన ధరలు ఇంకా అమలుకు నోచుకోలేదు. గత నెలలో మద్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా వాటిని అమలుకు ఆబ్కారీ శాఖాధికారులు ఐఎంఎల్ డిపోలోనే కొత్త ధరల తాలుకు స్టిక్కర్లను వేసి ఈ నెల 5న స్టాక్ ను బయటకు పంపించారు. ఐఎంఎల్ డిపోల నుంచి వచ్చిన స్టాక్ అలా ఉండగానే మద్యం అమ్మకాలు చేస్తున్నారు వ్యాపారులు. మద్యం సీసాలపై లిక్కర్ ఫ్యాక్టరీలు రూపొందించిన ధరలు ఉండగా ప్రభుత్వం తగ్గించిన ధరలను ఎక్సైజ్ అధికారులు స్టిక్కర్లను వేయగా వాటిని తొలిగించి అమ్మకాలు చేస్తున్నారు. మద్యం ధరలు తగ్గించిన విషయం తెలిసి అడిగిన వారికి సీసాలపై ఉన్న ధరలను, పాత స్టాక్‌గా ముద్రితంగా ఉన్న తయారీ వాటిని చూపించి అమ్మకాలు చేస్తున్నారు. ఈ తతంగం కేవలం మద్యం దుకాణాలకే కాకుండా బార్లలోనూ కొనసాగుతోంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో 141 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 28బార్‌లు ఉన్నాయి. ప్రతి రోజు రెండు కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా . 2021 నవంబర్ లో మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. 5 లక్షల జనాభా మొదలుకొని పట్టణ, గ్రామాల జనాభా స్లాబ్‌లను నిర్ణయించి సిక్రేట్ టేండర్‌ల ద్వార మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేశారు. ఈ ఏడాది నవంబర్ వరకు మద్యం అమ్మకా లకు లైసెన్స్ పొందిన వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. మద్యం దుకాణాల టెండర్ల సమయంలో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. పేరుకు ఎవరికి వారే మద్యం దుకాణాలు వచ్చినట్లు చెబుతుండగా పెద్ద వ్యాపారులు ఎవరికైతే మద్యం దుకాణాలు దక్కాయో వారి లైసెన్స్‌లను తీసుకుని సిండికేట్ ఏర్పాటు చేశారు.
దీని ద్వారా మద్యం అమ్మకాల విషయంలో వ్యాపారులు చెప్పిందే వేదంగా కొనసాగుతుంది. వారి మద్యం ధరలను ఇష్టం వచ్చినట్లు విక్రయిస్తున్నారని విమర్శలున్నాయి. ప్రభుత్వం తొలిసారి ఏప్రిల్ మాసంలో మద్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీర్ల గురించి పట్టించుకోలేదు. ఫుల్ బాటిల్ కు రూ.40, హాఫ్ బాటిల్ కు రూ.20, క్వాటర్ కు రూ.10 చొప్పున తగ్గించింది. వాటిని తక్షణం అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎక్సైజ్ శాఖాధికారులు ముందస్తుగా మద్యం సరఫరా అయ్యే ఐఎంఎల్ డిపోల వద్దనే పాత మద్యం సీసాలపై స్టిక్కరింగ్ వేసే పనిని చేపట్టారు. కార్మికుల ద్వారా ఈ తతంగాన్ని పూర్తి చేశారు. ఈ నెల 5న సంబంధిత స్టాక్ ఉమ్మడి జిల్లాలోని 141 మద్యం దుకాణాలకు సరఫరా చేశారు కూడా. వేసవి కాలం కావడంతో మద్యాని కంటే మద్యం ప్రియులు చల్లని బీర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని, దానికనుగుణంగా వాటి అమ్మకాలు ఎక్కువ జరుగుతున్నాయని చెబుతున్నారు.
అయితే మద్యం సీసాలపై ఆబ్కారీశాఖ ముద్రించిన కొత్త ధరల పరిశీలనకు ఆబ్కారి శాఖ ఎస్ హెచ్ వోలను ఇతర ప్రాంతాల మద్యం షాపులను తనిఖీ చేయించారు. జంబ్లింగ్ పద్ధతిలో ఈ తతంగం పూర్తి చేశారు. కానీ విక్రయాలకు వచ్చే సరికి వ్యాపారులు స్టిక్కర్లు తొలగించి పాత స్టాక్ గానే చెబుతూ అమ్మకాలు చేస్తున్నారు. ఈ విషయంలో మద్యం వ్యాపారులకు లాభాలు వస్తుండగా మద్యం ప్రియులు మాత్రం నష్టపోతున్నారు. లిక్కర్ అమ్మకాలు సాగుతూ ప్రతి నెల కొత్త స్టాక్ సరఫరా అవుతున్నట్లు ఐఎంఏల్ డిపోలో మద్యం దుకాణాల వారీగా లెక్కలు చెబుతుండగా అమ్మకాల విషయానికి వస్తే మాత్రం తేడాలు కనిపిస్తున్నాయి. సిండికేట్ మద్యం వ్యాపారుల కనుసన్నుల్లో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ స్థాయిలో మద్యం ధరల గురించి అడగకపోయినా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా తో పాటు పలు మున్సిపల్ ఏరియాలలో మద్యం ధరలపై అడిగిన వారికి దుకాణాదారులు దాట వేస్తునే అమ్మకాలు చేస్తున్నారు.