కాడెద్దులు కనుమరుగు.. పదేళ్లలో తగ్గిన పశువులు..

ఒకప్పుడు ఏరువాక పౌర్ణమి అంటే ఇంట్లో ఉన్న కాడెద్దులుకు పూజలు చేసి, వ్యవసాయానికి సంబంధించిన పనులను మొదలు పెట్టేవారు.

Update: 2024-06-21 13:20 GMT

దిశ, ఆలూర్ : ఒకప్పుడు ఏరువాక పౌర్ణమి అంటే ఇంట్లో ఉన్న కాడెద్దులుకు పూజలు చేసి, వ్యవసాయానికి సంబంధించిన పనులను మొదలు పెట్టేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. దుక్కి దున్నాలన్నా.. విత్తు వేయాలన్నా.. పండించిన పంట ఇంటికి చేరాలన్నా, ఒకప్పుడు కాడెద్దులు, ఎడ్లబండిని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయంలో యాంత్రీకరణ నేపథ్యంలో ట్రాక్టర్లు ఇతర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఎడ్లబండి జాడ ప్రశ్నార్థకంగా మారింది.

ఇక కాడెడ్దులు చూద్దామన్నా కానరాని పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని గ్రామాట్లో ఒకటి... రెండూ కనిపిస్తూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. జోడెద్దులను ఎవరైనా కొనుగోలు చేయాలన్నా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గతంలో రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన ఎడ్లబండ్లు నేడు ఉనికిని కోల్పోతున్నాయి. గతంలో ప్రతి రైతు ఇంటి వద్ద కాడెద్దులు, ఎడ్లబండ్లు రైతుకు అండగా ఉండేవి.

నాడు వ్యవసాయంలో కాడెద్దులు, ఎడ్లబండి ముఖ్య భూమికను పోషించేవి. సాగులో రైతుకు అండగా నిలిచేవి. ఏటా పంటల దుక్కులు దున్నేందుకు, విత్తనాలు వేసేందుకు కాడెద్దులు ఉండాల్సిందే. అసలు ఎద్దులు, ఎడ్లబండి లేని రైతు కుటుంబాలు ఉండేవి కాదు. ఇప్పటికీ వీటికి డిమాండ్‌ ఉన్నా మారిన వ్యవసాయ పరిస్థితులతో వీటి ఉనికి కరువవుతోంది. పల్లెటూర్లలో పాత రోజులు గుర్తుచేసుకొని మట్టి కాడెద్దులును తయారు చేసి పూజలు చేస్తున్నారు.

పనులు వేగంగా కావాలని...

వనులు వేగంగా చేపట్టాలని ట్రాక్టర్లతో పనులు చేస్తున్నారు. దీంతో ఎడ్ల అవసరం లేకుండానే పోతోంది. ఎడ్లు లేక పోవడంతో ఎడ్ల బండ్లను కూడా అమ్ముకుంటున్నారు. దీంతో గ్రామాల్లో ఎడ్ల బండ్లు లేకుండా పోయాయి. పాత కాలంలోనే సాగు విధానం బాగుండేదంటున్నారు రైతులు.

పోషించలేకే.

ఇక మరి కొంతమంది రైతులు కాడెడ్లను పెంచి పోషించ లేకనే ఉన్న ఎడ్లను అమ్ముకున్నాం అంటున్నారు.ఎడ్లబండ్ల పై తోటలకు వెళ్లినప్పుడు చిల్లి గవ్వ ఖర్చు లేకుండా కూలీలను తోటలకు తీసుకెళ్లే వాళ్లం అంటున్నారు. కానీ ఇప్పుడు ఆటోలు, పెట్టి తరలిస్తున్నారని చెబుతున్నారు. అప్పటి కాలంలో ఎడ్లబండ్ల సందడి వేరే ఉండేదంటున్నారు.


Similar News