పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల పై పోలీసుల మౌనం...

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ప్రధాన పోలీస్ స్టేషన్లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ అంతంత మాత్రమే ఉంటుందని ప్రజలు చెబుతున్నారు.

Update: 2024-07-14 10:00 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ప్రధాన పోలీస్ స్టేషన్లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ అంతంత మాత్రమే ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. పోలీసింగ్ సేవలు ఏ మాత్రం జరగడం లేదని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో పలు కేసుల పై ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘవిద్రోహ కార్యక్రమాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నా ఆర్మూర్ ప్రాంతంలోని పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది తమకేం పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆర్మూర్ జనం కోడై కుస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇష్టారీతిగా బెట్టింగ్ నిర్వహణ, వ్యభిచార కేంద్రాల నిర్వహణ, గంజాయి అమ్మకాలు, సమయపాలన లేని పర్మిట్ రూములు, గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ జోరుగా జరుగుతున్నా పోలీస్ అధికారులు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

ఆర్మూర్ పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే విధుల్లో చేరారు. ఆర్మూర్ ప్రాంతంలో విధుల్లో చేరిన పోలీసు ఉన్నతాధికారులు విధుల్లో చేరిన తర్వాత సంఘవిద్రోహ కార్యక్రమాల పై కనీసం కన్నెత్తి చూడకుండా, అటువైపు వెళ్లడం లేదు. దీంతో విచ్చలవిడి దందాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. ఈ ఇల్లీగల్ దందాలు నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారులను మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులే చూసీచూడనట్లు ఉంటున్నారని ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దీంతో పాటు ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు, విలేకరులు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారే తప్ప ఎక్కడ ఆ ఆనవాళ్లు కనబడటం లేదు అంటూ, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ అధికారుల దురుసు అహంకారపూరిత వైఖరి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతంలోని ప్రజలకు రక్షణ కల్పించి శాంతి భద్రతలు ఏర్పాటు చేసి చూడాల్సిన పోలీసులు ఇష్టారీతిగా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తూ ప్రజల్లో నమ్మకం కల్పించలేక పోతున్నారని ప్రజలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్ తదితర ప్రధాన పట్టణాల్లో ప్రధాన రోడ్ల వెంబడి వ్యాపారాలు నిర్వహించే వ్యాపారస్తులు రాత్రి 10 గంటలకి వారి వారి దుకాణాలను మూసి ఉంచాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారి కల్మేశ్వర్ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా ఆర్మూర్ ప్రాంతంలో మాత్రం దర్జాగా అర్ధరాత్రి వ్యాపారాలు జరుగుతున్నా పట్టించుకునే పోలీసు నాధుడే కరువయ్యాడని ఆర్మూర్ ప్రాంతంలోని జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పలు వివాదాల, గొడవల కేసుల్లో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు చేస్తున్న వారి ఫిర్యాదుల పై ఆర్మూర్ పోలీసులు మౌనం పాటిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఉన్నతాధికారులు ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తుల సహాయంతో సెటిల్మెంట్లు నిర్వహించి భారీగా ముడుపులు దండుకుంటున్నట్లు ఆర్మూర్ జనం కోడై కూస్తుంది. ఆ తర్వాత అధికారికంగా కోర్టు ద్వారా లోకదాలత్ కార్యక్రమంలో ఆ ఫిర్యాదు చేసిన ఇద్దరు కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి సమస్యలను ఆర్మూర్ ప్రాంత పోలీసులు చేస్తున్నట్లు తెలిసింది.


Similar News