Additional Collector Kiran Kumar : బీసీ కమిషన్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఈ నెల 29న
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఈ నెల 29న నిజామాబాద్ కు విచ్చేయనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. బీ.సీ కమిషన్ పర్యటనను పురస్కరించుకుని శనివారం ఐడీఓసీలో సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆయా శాఖల అధికారులకు వారు నిర్వర్తించవలసిన విధుల గురించి వివరిస్తూ, బాధ్యతలను పురమాయించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 29న నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని బీసీ కమిషన్ (BC Commission) స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయాలు సేకరిస్తుందని అన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వారు, భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు కామారెడ్డి జిల్లాకు చెందిన వారు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను కమిషన్ కు నివేదించవచ్చని తెలిపారు.
అభిప్రాయాల సేకరణ కోసం విచ్చేస్తున్న బీ.సీ కమిషన్ పర్యటన గురించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కమిషన్ పర్యటనను పురస్కరించుకుని ఆయా శాఖల వారీగా అధికారులు, సిబ్బందికి కేటాయించిన విధులను తుచా తప్పకుండా పాటించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. అత్యంత కీలకమైన అంశం పై కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ జరుపనున్న దృష్ట్యా, ఈ ప్రక్రియకు ఎక్కడ కూడా ఏ చిన్న అవాంతరం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. తమ అభిప్రాయాలను కమిషన్ కు నివేదించేందుకు హాజరయ్యే వారికి సహకరించేందుకు వీలుగా రెండు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ హెల్ప్ డెస్క్ ల వద్ద సరిపడా సిబ్బందిని, అవసరమైన స్టేషనరీని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
అభిప్రాయాలు తెలియజేయాలనుకునే వారు రాతపూర్వక సమర్పణలు, అభ్యర్థనలను నేరుగా సమర్పించవచ్చని సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం వినతి పత్రాలతో కూడిన పూర్తి వివరాలు, వీడియోలు, ఫోటోగ్రాఫ్స్ (Videos, photographs) తదితర వాటిని కమిషన్ కు సమర్పించాల్సి ఉన్నందున అన్నింటినీ జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాగా, ఎలాంటి ఒడిదుడుకులకు తావులేకుండా అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు తెలిపారు. సన్నాహక సమావేశంలో డీఆర్డీఓ సాయ గౌడ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి స్రవంతి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.