నిజామాబాద్ లో ఏసీబీ దాడులు...భారీగా నగదు, బంగారం పట్టివేత

నిజామాబాద్​లో ఓ భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది.

Update: 2024-08-09 13:36 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్​లో ఓ భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సూపరింటెండెంట్, ఇంచార్జి రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ నిజామాబాద్ రేంజ్ డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు తమ తనిఖీల్లో వెల్లడైందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అధికారుల తనిఖీలో రూ. 2,93,81,000 నగదు, నరేందర్ భార్య, తల్లి పేర్లపై ఉన్న బ్యాంక్ అకౌంట్లలో రూ. 1.10 కోట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 6 లక్షలు, రూ.1.98 కోట్ల విలువైన 17 స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు

    ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం అభరణాలు, స్థిరాస్తి పత్రాల విలువ సుమారు రా.6,07,81,000 లు ఉంటుందని ఏసీబీ నిజామాబాద్ రేంజ్ డీ ఎస్ పీ శేఖర్ గౌడ్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే నిర్మల్ లోని నరేందర్ అత్తగారింట్లో, ఆయన అమ్మ గారింట్లో సోదాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నాలుగు బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయన్నారు. నిందితుడు దాసరి నరేందర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. ఇంకా ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని వెలికితీసేందుకు సోదాలు కొనసాగుతున్నాయన్నారు. ఏసీబీ తనిఖీల్లో డీ ఎస్ పీ శేఖర్ గౌడ్ తో పాటు ఇన్ స్పెక్టర్లు నాగేష్, శ్రీనివాస్, వేణు, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. 

Tags:    

Similar News