వరద కాల్వ కనుమరుగు.. రోడ్డును కబ్జా చేసిన ఫార్మా కంపెనీ ప్రహరీ గోడ నిర్మాణం

అనాదిగా ఉన్న బోధ రాగు కాలువ ఫార్మా కంపెనీ పుణ్యమా అని కనబడకుండా పోయింది.

Update: 2024-06-30 02:50 GMT

దిశ భిక్కనూరు: అనాదిగా ఉన్న బోధ రాగు కాలువ ఫార్మా కంపెనీ పుణ్యమా అని కనబడకుండా పోయింది. నిన్న మొన్నటి వరకు ఉన్న ఈ కాలువ, ఇప్పుడు అక్కడికి వెళ్లి చూస్తే కాలువను ఖతం పట్టించి... ఆనవాళ్లు కూడా కనిపించకుండా..., రోడ్డును కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టిన వైనం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో వెలుగు చూసింది. వర్షాలు కురిసే సమయంలో స్థానిక 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో లోపలికి వెళ్లి చూస్తే తప్ప కాలువ కనిపించదు. ఇదే అవకాశం గా తీసుకొని ఫార్మా కంపెనీ యాజమాన్యం కబ్జాకు పాల్పడింది. ఈ వరద కాలువ కనబడకుండా అక్కడక్కడ జేసీబీలతో చదును చేయించి, కాలువ ఇరుపక్కల ఉండే చెట్లు కొమ్మలను ఈ మధ్యనే తొలగించేశారు. కాలువ ఆనవాళ్లు పూర్తిగా కనిపించకుండా చేస్తే, తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ముందుచూపుతో ఈ పని చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు పంట పొలాల మధ్యలో ఉన్న బోధ రాగు ద్వారా పారుతూ కాచాపూర్ చెరువులోకి వెళ్తాయి. కొందరు రైతులు రెండున్నర ఎకరాల పట్టా స్థలాన్ని కొన్నేళ్ల క్రితం మధ్యవర్తి ద్వారా ఫార్మా కంపెనీకి విక్రయించారు. ఈ కాలువ పక్కన భాగంలోనే ఫార్మా కంపెనీ ఉండడంతో, ఆ కంపెనీ యాజమాన్యం నాయకుల అండదండలతో పొలాలకు వెళ్లే దారిని కబ్జా చేయడమే కాకుండా, కాలువ నీళ్ళు వెళ్లకుండా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు..?

ప్రహరీ గోడ నిర్మాణం తో పాటు... కబ్జాకు గురైన రోడ్డు విషయమై బాధిత రైతులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. వానకాలం కావడంతో పంట పొలాలకు వెళ్లి సాగెట్ల చేసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫార్మా కంపెనీ ప్రహరి గోడ నిర్మించడాన్ని రైతులు వ్యతిరేకించడంతో కొద్దిరోజులు ఆ ప్రాంతంలో నిర్మాణ పనులు నిలిపివేసి, మిగతా ప్రాంతంలో పనులు పూర్తి చేశారు. ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకుల దృష్టికి రైతులు తీసుకెళ్లగా నీకెందుకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చినట్లే ఇచ్చి, గోడ నిర్మాణం చేపట్టడంతో తమ పంట పొలాలకు ఏ దారి గుండా వెళ్లాలని, ఇది పూర్తిగా అన్యాయమని వారితో ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలకు వెళ్ళరాకుండా, దారి లేకుండా చేయడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత రైతులు కామారెడ్డి లో జరిగిన ప్రజా వాణి కార్యక్రమానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.

పంట సాగు చేసేదెలా..?: తాటిపాముల రాజమణి

వానాకాలంలో కంది, మినుము పంట సాగు చేసుకొనే వాళ్ళమని, కాలువ కబ్జా చేసి ఫార్మా కంపెని ప్రహరి గోడ నిర్మాణం చేపట్టడం వలన దారి లేకుండా పోయింది. 2009 డిసెంబర్22న536 సర్వే నెంబర్ లో అర ఎకరం భూమి ఫ్రీడం ఫైటర్ కింద ప్రభుత్వం భూమి ఇచ్చింది. అప్పటినుంచి ఆ భూమిలో పంటలు సాగు చేస్తున్నారు. మాకు అధికారులు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది.


Similar News