పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ సైకిల్ యాత్ర

పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈటర జిల్లా చెక్కర్ నగర్ తాలూకాకు చెందిన రాబిన్ సింగ్ అన్నారు.

Update: 2023-12-28 10:27 GMT

దిశ, కామారెడ్డి : పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈటర జిల్లా చెక్కర్ నగర్ తాలూకాకు చెందిన రాబిన్ సింగ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద గురువారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించారు. రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని తెలిపారు. రైతులు సేంద్రియ ఎరువులు వాడే విధంగా చూడాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మినరల్ వాటర్ తాగవద్దని, బోరు నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటిని తాగాలని సూచించారు.

    ప్లాస్టిక్ బాటిళ్లులో నీటిని తాగడం వల్ల కలిగే అనర్థాలను తెలిపారు. గ్రీన్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి రామాయంపేట మీదుగా గురువారం కామారెడ్డి చేరుకున్నారు. రాత్రి వరకు నిజామాబాద్ చేరుకుంటానని తెలిపారు. ఇప్పటి వరకు 2,648 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం తను సైకిల్ యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటి ప్రాణవాయువును పెంచుకోవాలని సూచించారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందని చెప్పారు. మొక్కలను సంరక్షణ చేస్తే భావితరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపడతానని తెలిపారు. 


Similar News