మెడికల్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య పై సమగ్ర విచారణ చేపట్టాలి : ఎన్ఎస్యూఐ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న సనత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

Update: 2023-03-31 11:43 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న సనత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.యూ.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ నెలరోజులు ముందు దాసరి హర్ష అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, ఈరోజు సనత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటే అసలు నిజామాబాద్ మెడికల్ కళాశాల విద్యార్థుల పై కళాశాల పరిపాలన విభాగం పర్యవేక్షణ లేదని స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అన్నారు.

నెల రోజులు గడవక ముందే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. మెడికల్ కాలేజీలో విద్యార్థి మృతి పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని, విద్యార్థి ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా లేక కాలేజీలో ఏదైనా సమస్య వల్లనా, సీనియర్ల వేధింపులా, ర్యాగింగా లేక బోధనా సిబ్బంది ఒత్తిడి కారణమా అనే విషయాన్ని సమగ్ర విచారణ చేసి నిజాలు నెగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. దీన్ని ఆత్మహత్య లాగా కాకుండా వేరే కోణంలో దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే మెడికల్ కాలేజీల్లోని వసతి గృహాల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా అందుబాటులో లేవని ఇదే విషయాన్ని ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి సంఘం పక్షాన దాసరి హర్ష ఆత్మహత్య చేసుకున్నప్పుడే వసతి గృహాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని డిమాండ్ చేశామని అన్నారు.

కానీ ఇప్పటికీ కళాశాల అధికారులు, సిబ్బంది సీసీ కెమెరాలో ఏర్పాటు పై నిర్లక్ష్యం వహించారని అన్నారు. తక్షణమే వసతి గృహాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని వారు కోరారు. మొన్న వరంగల్ లో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడడం, తర్వాత నిజామాబాద్ మెడికల్ కళాశాలలో దాసరి హర్ష ఆత్మహత్య చేసుకోవడం, ఈరోజు ఇదే కళాశాలలో సనత్ అనే విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఇలా రోజుకో మెడికల్ విద్యార్థి బలవడం చూస్తుంటే అసలు ప్రభుత్వానికి మెడికల్ కళాశాల పర్యవేక్షణ పట్ల చిత్తశుద్ధి ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెస్తామని ప్రగల్బాలు పలకడం కాదని, ముందు ఉన్న మెడికల్ కళాశాలలోని విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు సయ్యద్ అష్రఫ్, లక్ష్మణ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News