బంజారాల సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్దపీట : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..

దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-02-23 14:39 GMT

దిశ, భీమ్‌గల్‌ : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో సైతం తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని పేర్కొన్నారు. భీమ్‌గల్‌ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284 జయంతి ముగింపు ఉత్సవాలను గురువారం అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

రూ.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బంజారా భవన్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రిప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అడవి బిడ్డలైన బంజారాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 700 తండాలు మాత్రమే గ్రామ పంచాయతీలుగా ఉండేవని, గిరిజనులకు పాలనాధికారం కల్పించాలనే లక్ష్యంతో 500 జనాభా కలిగిన ప్రతితండాను గ్రామపంచాయతీ హోదా కల్పించడంతో రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా 2400 తండాలు జీపీలుగా అవతరించాయని వివరించారు. గ్రామ పంచాయతీలకు పక్కాభవనాల నిర్మాణాల కోసం ఒక్కో జీపీకి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామన్నారు.

రూ.1276 కోట్ల నిధులను వెచ్చిస్తూ ప్రతితండాకు ప్రభుత్వం రోడ్డు సదుపాయం కల్పించిందని తెలిపారు. 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న గిరిజన కుటుంబాలకు ఉచితవిద్యుత్ అమలవుతోంది గుర్తు చేశారు. అన్నింటికి మించి గిరిజన బిడ్డలకు అధునాతన సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యా బోధన అందాలనే తాపత్రయంతో కొత్తగా 300 వరకు ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఆరు శాతానికి పరిమితమైన గిరిజన రిజర్వేషన్ ను జనాభా ప్రాతిపదికన పది శాతానికి పెంచిన ఫలితంగా అదనంగా 3200 మందికి ఇంజనీరింగ్ లో, 190 మందికి మెడిసిన్ కోర్సులలో ప్రవేశాలు లభించాయని వివరించారు.

సీఎం కేసీఆర్ చొరవతోనే దశాబ్దాల కాలం నుండి పెండింగ్ లో ఉంటూ వచ్చిన మానాల - మర్రిమడ్ల, దేవక్కపేట - కాటిపల్లి రోడ్లకు అటవీశాఖ అనుమతులు సాధించి ప్రస్తుతం పనులను వేగంగా జరిపిస్తున్నామని అన్నారు. భీంగల్ లోని కస్తూర్బా పాఠశాలలో నెలకొని ఉన్నసమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ కు సూచించారు. భీంగల్ లో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీహనుమంతు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. 18వ శతాబ్దంలోనే అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పని చేశారని అన్నారు.

అహింసామార్గాన్ని అవలంభించాలని, అనర్ధాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతిఒక్కరికి అనుసరణీయమని అన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలతో పాటు, నగదు పారితోషికాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రేమలత సురేందర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, ఎంపీపీ మహేష్, జెడ్పీటీసి రవి, జెడ్పీ కో-ఆప్షన్ మొయిజ్, బాల్కొండ నియోజకవర్గ ప్రత్యేక అధికారి సింహాచలం, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగూరావు, ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, బంజారా సేవా సంఘం ప్రతినిధులు, వివిధ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ తండాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు పాల్గొన్నారు.

Tags:    

Similar News