ఆర్టీసీకి త్వరలో రెండు వేల కొత్త బస్సులు.. మంత్రి పొన్నం ప్రభాకర్

Update: 2023-12-25 13:32 GMT

దిశ, ఆర్మూర్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి త్వరలో 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ లో ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి బస్టాండ్ ప్రాంగణంలోని మహిళలను అడిగి పొన్నం ప్రభాకర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులు తెలంగాణ ప్రజల ఆస్తులు అన్నారు. ఆర్టీసీ స్థలాలపై కన్నేస్తే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో లీజులకు ఇచ్చిన ఆర్టీసీ స్థలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రివ్యూ చేస్తామన్నారు. ఆర్టీసీ స్థలాల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు తేలితే ఆ స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి ఆర్టీసీకి అప్పగిస్తుంది అన్నారు.

ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు నాలుగు కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు పెరిగి, ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఆదాయం పెరిగిందన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా మగవారికి ఆర్టీసీ బస్సుల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఆ విషయాన్ని త్వరలోనే క్యాబినెట్ మీటింగ్ లో చర్చించి అదనపు బస్సులు ప్రారంభిస్తామన్నారు.

6 గ్యారంటీలకు సంబంధించి ఈనెల 28వ తారీకు నుంచి ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరు గ్రామసభల్లో, వార్డు సభల్లో మీ దగ్గరకు వచ్చే అధికారులకు నాలుగు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ లు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార చంద్రమోహన్, మాజీ నిజాంసాగర్ ప్రాజెక్టు చైర్మన్ యాళ్ల సాయి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు విట్టం జీవన్, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యదర్శి కోల వెంకటేష్, వెంకటేష్ రావు పటేల్, మంథని చుక్క పుట్టింటి శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి బాబాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News