పోలీస్ పోస్టింగ్ పదిలమేనా..

రాష్ట్రవ్యాప్తంగా 18 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రిఉత్తర్వులు జారీ అయ్యాయి.

Update: 2023-02-08 16:23 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 18 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రిఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ను డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఆయన స్థానంలో టాస్క్ ఫోర్స్ లో ఉన్న కిరణ్ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చారు. నిజామాబాద్ ఏసీపీగా వెంకటేశ్వర్ విధులలో చేరి రెండు సంవత్సరాలు పూర్తయిందో లేదో ఆయనను బదిలీ చేయడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఎన్నికల తేది వరకు నిజామాబాద్ ఏసీపీగా ఉంటారని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయనను బదిలీ చేయడం పోలీసు అధికారుల్లో కొత్త గుబులు రేపింది. నేతల సిఫారసు లేఖలతో పోస్టింగ్ లు తెచ్చుకున్న అవి కనీసం మూడేళ్లు బాధ్యతలు నిర్వర్తించకుండానే పోస్టింగ్ లు పోవడం పోలీసు అధికారుల్లో అభద్రత భావాన్ని పెంచుతుంది. అంతేగాకుండా పోస్టింగ్ ల విషయంలో ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడంతో పాటు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు సహకరిస్తలేరన్న కారణంతో బదిలీ చేయించడంతో పోలీసు అధికారుల్లో ఒక విధమైన నైరాశ్యం నెలకొంది.

గత నెల 29న కామారెడ్డి డీఎస్పీ సోమనాథంను హైదరాబాద్ డీజీపీ కార్యాలయంకు అటాచ్డ్ చేశారు. ఆయన స్థానంలో ఇతరులను నియమించారు. గతేడాది బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డిని ఉన్నపళంగా బదిలీ చేశారు. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బాన్సువాడ బంద్ ను నియంత్రించలేదన్న కారణం చూపి ఆయనను బదిలీ చేశారు. మొన్నటికి మొన్న బోధన్ ఏసీపీ రామారావును మూడేళ్ల పదవి కాలం పూర్తి చేయకముందే బదిలీ చేశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ బదిలీ కూడా అకస్మాతుగా జరగడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాలో కేవలం ఏసీపీలకే కాకుండా సీఐలు, ఎస్సైల పోస్టింగ్ లు కూడా ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. డిచ్ పల్లి సీఐగా పనిచేసిన ప్రతాప్ ను డీసీఆర్ బీకి బదిలీ చేశారు. ఆయనకు మొన్నటికిమొన్న నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐగా పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు.

నిజామాబాద్ నగర సీఐ పోస్టు సెప్టెంబర్ 5న సీఎం పర్యటన సందర్భంగా జరిగిన వివాదంలో అప్పటి సీఐని ఏడాది తిరుగకముందే బదిలీ చేశారు. అక్కడ పోస్టింగ్ ఇవ్వడానికి రెండు నెలల సమయం పట్టింది. నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐగా జగడం నరేష్ సిద్దిపేట్ సీసీఎస్ నుంచి అటాచ్డ్ గా కొనసాగారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సైల పోస్టులు ఎప్పుడు మారుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో పోస్టింగ్ తెచ్చుకున్న వారికి అనిగిమనిగి ఉండకపోయినా ప్రతిపక్షాలకు సహకరిస్తున్నారని అనుమానం వచ్చినా పోస్టింగ్ లు హుస్టింగ్ అవుతున్నాయి. చాలా మంది సీఐలు, ఎస్సైలు ఇప్పటికి ప్రజాప్రతినిధుల చుట్టు పోస్టింగ్ ల కోసం చక్కర్లు కొడుతున్నారు. రానున్నది ఎన్నికల కాలం కావడంతో ఇప్పటికే తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు బదిలీలు చేస్తున్నారనే అపవాదు కూడా కొనసాగుతుంది.

Tags:    

Similar News