Hyderabad Rains : నిండుకుండలా హుస్సేన్ సాగర్.. GHMC అలర్ట్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. బంజారా, పికెట్, కూకట్‌పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు హుస్సేన్ సాగర్ లోకి వచ్చి చేరుతోంది. ఈ వరద నీటితో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. ఎఫ్‌టీఎల్‌కు చేరుకోవడంతో ఇప్పటికే అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువన ఉన్న మూసీ నదికి నీటిని వదిలారు.
దీంతో సిటీ ప్రజలకు జీహెచ్ఎంసీ నిన్నటి నుంచి అలర్ట్ జారీచేస్తోంది. హుస్సేన్ సాగర్ వరద నీటి పరిస్థితిని జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి వర్షం దంచికొట్టింది. గచ్చిబౌలిలో అత్యధికంగా 97 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.