రుణమాఫీ అమలులో కొత్త ట్విస్ట్! బీఆర్ఎస్ హెచ్చరిక ఇదే..
తెలంగాణలో ఆగస్టు 15 వ తేదీలోపు రూ. 2లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అవుతుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఆగస్టు 15 వ తేదీలోపు రూ. 2లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇందుకోసం వారు పాస్‌బుక్‌లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా సూచించినట్లు తెలుస్తుంది. అయితే రైతులకు రుణమాఫీ విషయంలో మొదటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ సోమవారం ఆసక్తికర ట్వీట్ చేసింది. రుణమాఫీ అమలులో కాంగ్రెస్ సర్కార్ కొత్త మెలిక పెట్టిందని బీఆర్ఎస్ విమర్శించింది. పాస్‌బుక్‌లు, రేషన్ కార్డులున్న వారికే రుణమాఫీ చేస్తామంటూ కాలయాపన చేస్తోందని తెలిపింది. రోజుకో మాట మారుస్తూ అన్నదాతలను అరిగోసకు కాంగ్రెస్ ప్రభుత్వం గురి చేస్తున్నదని విమర్శలు గుప్పించింది.
కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతాయి.. కానీ చేతలు గడప దాటవని పేర్కొంది. అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు సవాలక్ష మెలికలు పెట్టి రుణమాఫీ ఎగ్గొడదామని చూస్తుందని ఆరోపించింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా రైతులందరికి రూ. 2 లక్షల రుణమాఫీ చేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించింది.