ఇది జగమెరిగిన సత్యం.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
ప్రపంచ అటవీ దినోత్సవం(World Forest Day) సందర్భంగా హైదరాబాద్‌లోని KBR పార్కులో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ అటవీ దినోత్సవం(World Forest Day) సందర్భంగా హైదరాబాద్‌లోని KBR పార్కులో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా నేను చెట్ల సంరక్షణలో భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మన సంస్కృతి, సాంప్రదాయంలోనే వృక్ష సంరక్షణ ఉన్నదని తెలిపారు. వృక్షో రక్షతి రక్షితః చెట్టును మనం కాపాడితే.. చెట్టు మనల్ని కాపాడుతుంది. ఇది జగమెరిగిన సత్యమని చెప్పారు. అడవుల పరిరక్షణ(Conservation of forests) ఆవశ్యకత అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో, జనంలో చైతన్యం రావాలని మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించి.. ప్రతి ఏటా నిర్వహిస్తుందని అన్నారు.
‘పర్యావరణ పరిరక్షణ, జీవజాలం మనుగడకు అడవులే ఆధారం. జీవజాలానికి, వనాలకు విడదీయరాని సంబంధం ఉంది. అడవులను ప్రజలు తమ స్వలాభం కోసం నాశనం చేస్తూ.. తమ ఉనికిని తామే ప్రశ్నార్థకం చేసుకొంటున్నారు. ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే, మానవ మనుగడకు ఆధారంగా నిలుస్తున్న అడవులను జాగ్రత్తగా కాపాడుకునేలా అందరం ఉద్యమించాలి. ప్రకృతిని సంరక్షిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించడంలోనే అర్థవంతమైన జీవితం ఉంది. అడవుల ప్రాముఖ్యత, అడవులతో మనిషికి ఉన్న అనుబంధం, అడవుల సంరక్షణకు అనుసరించాల్సిన కార్యాచరణ ఈ సందర్భంగా మనమంతా గుర్తు చేసుకోవాలి. అడవులను సంరక్షించుకోకపోతే తలెత్తే విపత్కర పరిస్థితులను అటవీ దినోత్సవం సందర్భంగా మనమంతా మననం చేసుకోవాలి’ అని మంత్రి సూచించారు.
పట్టణీకరణ, పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టుల నిర్మాణం, పోడు వ్యవసాయం, గృహాల నిర్మాణం వంటి కారణాలతో అడవులు నానాటికీ అంతరించి పోతున్నాయన్నది మనమంతా ఆవేదన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. భూ విస్తీర్ణానికి అనుగుణంగా అడవుల విస్తరణ లేకపోవడంతో గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కఠిన సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పర్యావణంలో సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నామని వెల్లడించారు. వన్య ప్రాణులకు ఆవాసాలైన అడవులను కాపాడుకుంటేనే జీవవైవిధ్యం వర్ధిల్లుతుందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజలు కూడా తమవంతు సహకారం అందిస్తేనే అడవుల విస్తీర్ణంలో వృద్ధి నమోదవుతుందని అన్నారు. ఇందు కోసం ప్రజలు అందరూ కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓ వైపు ఉన్న అడవులను సంరక్షించుకుంటూనే, మరోవైపు అటవీ సంపదను పెంచేందుకు సమర్పణ, సంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వనమహోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుందని చెప్పారు. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పెస్కోవా, అటవీ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.