కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తాము అధికారంలోకి వస్తే కొత్త సచివాలయం డోమ్ లు కూల్చేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయం డోములు కూల్చివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డోములు తెలంగాణ సంస్కృతికి భిన్నంగా ఉన్నాయని, వాటిని కూల్చి అనుగుణంగా మళ్ళీ మార్పులు చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌లో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం బోయినపల్లి చౌరస్తాలో వీధి సభలను బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ రోడ్డు పక్కన ఉన్న గుళ్ళు, మసీదులు కూల్చుతామని చెబుతున్నారని, ఆయనకు దమ్ముంటే ఈ కూల్చివేతలను ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలని సవాల్ విసిరారు. ఎంఐఎం, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆయన విమర్శలు చేశారు. అందుకే తాజ్ మహల్ కంటే అద్భుతంగా కొత్త సచివాలయాన్ని కేసీఆర్ కట్టారని ఓవైసీ అంటున్నాడన్నారు. అసదుద్దీన్ కండ్లలో ఆనందం చూడడానికే కేసీఆర్ తాజ్ మహల్ నమూనాలో కొత్త సచివాలయాన్ని నిర్మించారని బండి వ్యాఖ్యానించారు.
15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 11వేల కార్నర్ మీటింగ్స్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనను ప్రజలోకి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేడని విమర్శలు చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు.
ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో నెలకొందన్నారు. 60 శాతం రెవెన్యూ ఇచ్చే హైదరాబాద్‌ను ముఖ్యమంత్రి ఏం అభివృద్ధి చేశాడో సమాధానం చెప్పాలని నిలదీశారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని బండి ఘాటుగా స్పందించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎందుకు అమలుచేయడం లేదని సీఎంను ప్రశ్నించారు. ఈనెల 25 వరకు నిర్వహించే స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే విషయాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరనున్నట్లు బండి సంజయ్ స్పష్టంచేశారు.