వారంలో కాలేజీలకు న్యూ లెక్చరర్స్..! 1,139 మందికి త్వరలో నియామక పత్రాలు
రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలకు కొత్త లెక్చరర్లు రానున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలకు కొత్త లెక్చరర్లు రానున్నారు. ఏండ్ల నుంచి ఖాళీగా ఉన్న పోస్టులకు త్వరలోనే పర్మినెంట్ లెక్చరర్లను నియమించనున్నారు. రెండేండ్ల కింద టీజీపీఎస్సీ ద్వారా 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం 1139 పోస్టులకు సంబంధించిన సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితాను ఇంటర్ కమిషనరేట్‌కు టీజీపీఎస్సీ అందించింది. దీంట్లో మల్టీజోన్ 1లో 581 మంది ఉండగా, మల్టీజోన్ 2లో 558 మంది ఉన్నారు. దీంట్లో ప్రధానంగా అరబిక్ సబ్జెక్టులో 2, బాటనీ 112, కెమిస్ర్టీ 123, సివిక్స్ 66, కామర్స్ 53, ఎకనామిక్స్ 87, ఫ్రెంచ్ రెండు, హిందీ 116, హిస్టరీ 83, మ్యాథ్స్ 156, ఫిజిక్స్ 120, సంస్కృతం 9, తెలుగు 55, ఉ ర్దూ 21, జువాలజీ 134 పోస్టులు ఉన్నాయి. వీరందరికీ వారంలోనే నియామక పత్రాలు అందించేందుకు ఇంటర్మీడియేట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీరందరి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి కావడంతో, పోస్టింగులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.