కడెం ప్రాజెక్టుపై అవగాహన లేదన్న కేటీఆర్.. నెటిజన్లు సీరియస్ (వీడియో)
కుంభవృష్టి వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో ఉంది. అయితే కడెం ప్రాజెక్టు పరిస్థితిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కుంభవృష్టి వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో ఉంది. అయితే కడెం ప్రాజెక్టు పరిస్థితిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం హైదరాబాద్ నగరంలో వరద పరిస్థితిని కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడం లేదు కదా అని మీడియా ప్రశ్నించగా కడెం ప్రాజెక్టు గురించి అక్కడ ఉన్న పరిస్థితి గురించి తనకు ప్రత్యక్షంగా అవగాహన లేదంటూ కేటీఆర్ బదులు ఇచ్చారు. అవగాహన లేని సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడకూడదు. మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపళ్ల గురించి, హైదరాబాద్ గురించి చెప్పగలను కానీ కడెం ప్రాజెక్ట్ వద్ద ఏం జరుగుతుందో తనకు తెలియదని బదులిచ్చారు.
అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను నెటిజన్లు షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తమకు పేరు వస్తుందనుకునే విషయాల్లో అన్ని శాఖలకు తానే మంత్రిని అన్నట్లుగా వ్యవహరించే కేటీఆర్ కడెం ప్రాజెక్టు విషయానికి వస్తే తనకు సంబంధం లేదని తప్పించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గేట్ల మరమ్మత్తుల గురించి సమాధానం చెప్పాల్సి వస్తుందనే తనకు అవగాహన లేదంటూ తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది భారీ వరదల సమయంలో ప్రమాదపు అంచుల వరుకు ఈ ప్రాజెక్టు వెళ్లింది. ఆ ఘటనతోనైనా గేట్లకు మరమ్మత్తులు చేయలేదు. దీంతో తాజాగా మరోసారి గేట్లు మొరాయిస్తున్నారు. మొత్తం 18 గేట్లు ఉండగా 14 తెరుచుకున్నాయి. మరో నాలుగు గేట్లు మొరాయించాయి. దీంతో జేసీబీ సాయంతో ఒక గేటును అధికారులు పైకి ఎత్తారు. కడెం ప్రాజెక్టు విషయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.