BRS, బీజేపీ మధ్య మరో కొత్త వార్ షురూ.. రెండు పార్టీల మధ్య కాకరేపిన మోడీ ప్రకటన..!

బీఆర్ఎస్, బీజేపీ మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. నిన్నటి పాలమూరు సభలో ప్రధాని మోడీ నిజామాబాద్‌కు పసుపు బోర్డుపై చేసిన ప్రకటనతో ఈ రెండు పార్టీల

Update: 2023-10-02 11:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. నిన్నటి పాలమూరు సభలో ప్రధాని మోడీ నిజామాబాద్‌కు పసుపు బోర్డుపై చేసిన ప్రకటనతో ఈ రెండు పార్టీల మధ్య క్రెడిట్ వార్ షురూ అయింది. పసుపు బోర్డు సక్సెస్ తమదంటే తమదే అంటూ ఇరు పార్టీలు క్లెయిమ్ చేసుకోవడం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలే గత ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను తారుమారు చేసిన అంశం కావడంతో ఈ విషయంలో ప్రధాన పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే మధ్యలో కాంగ్రెస్ సైతం విమర్శలతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది.

మోడీ ప్రకటనతో ఇచ్చిన మాట నిలుపుకున్నామని బీజేపీ నేతలు చెబుతుంటే.. పసుపు బోర్డు విషయంలో బీజేపీ ఇచ్చిందేమి లేదని తామే కేంద్రం మెడలు వచ్చి ఇచ్చేలా చేశామని బీఆర్ఎస్ చెబుతోంది. ఇదిలాఉంటే ఇది రాజకీయ పార్టీలతో సాధ్యం కాలేదని పసుపు రైతుల ఒత్తిడి వల్లే సాధ్యమైందని అవకాశం ఉన్న ప్రతిసారి రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు వెళ్లి ప్రయత్నాలు చేయడం వల్లే ఇది పసుపు బోర్డు వచ్చిందని రైతులు చెబుతున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న క్రెడిట్ వార్‌లో పసుపు రైతుల మద్దతు ఎవరికి అనేది ఆసక్తిగా మారింది.

పసుపు బోర్డు ఎవరికి అస్త్రం?:

'పసుపు బోర్డు' నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఓ హైవోల్టేజ్ టాపిక్. ఈ అంశం జిల్లాతో పాటు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. గత లోక్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చావు దెబ్బ కొట్టి బీజేపీకి విజయం సాకారం చేసింది కూడా ఈ పసుపు బోర్డు వ్యవహారమే కావడంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో నిరంతరం నానుతూనే ఉంటుంది. అయితే హామీ మేరకు పసుపు బోర్డు తెస్తారనుకున్న అర్వింద్ ఆ తర్వాత స్పైస్ బోర్డే బెటర్ అని చెప్పడంతో అర్వింద్‌పై గులాబీ శ్రేణులు గురిపెట్టాయి. అర్వింద్‌కు వ్యతిరేకంగా ప్రచారాలు, ఫ్లెక్సీలతో రాజకీయ వ్యూహాన్ని మొదలు పెట్టాయి.

ఇంతలో అనూహ్యంగా ప్రధాని పసుపు బోర్డు ప్రకటించడంతో ఈ అంశం ఎవరికి అస్త్రంగా మారబోతున్నదనేది ఉత్కంఠగా మారుతున్నది. ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు దెబ్బతో ఇక బీఆర్ఎస్ పని ఖతమే అని కమలం నేతలు చెబుతుంటే బీజేపీకి అంత సీన్ లేదని.. ఈ విషయంలో మాటే వాస్తవం అయితే మరి స్పైస్ బోర్డు ఎందుకు ప్రకటించారని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. ప్రకటన చేయడానికే దశాబ్దం పట్టిందని ఇక బోర్డు అమలు చేయడానికి ఇంకెన్నేళ్లు పడుతోందో అంటూ సెటైర్లు వేస్తోంది.

ఎన్నికల ముందు ప్రకటించిన బోర్డుతో కాషాయ పార్టీకి ఈసారి డ్యామేజ్ తప్పదని ప్రధాని నిజామాబాద్ పర్యటనకు ముందు రైతువ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు ఎన్నికల స్టంట్‌గా ప్రకటన చేశారని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఇక పాత హామీని ప్రధాని కొత్తదిగా చెబుతున్నారని ఇప్పటికే హామీ ఇచ్చి ఆలస్యం చేశారని కాంగ్రెస్ వాదిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలు పసుపు బోర్డు మాటున రాజకీయాలు చేశాయంటూ ధ్వజమెత్తుతోంది. దీంతో తాజా పరిణామాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాలిటిక్స్‌లో సెగలు పుట్టిస్తుంటే ఈ వ్యవహారంలో పసుపు రైతులు ఏ పార్టీ పక్షాన ఉండబోతన్నారనేది చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్‌కు నిజాం షుగర్ ఫ్యాక్టరీ టెన్షన్:

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన చేయడంతో బీఆర్ఎస్‌కు నిజాం షుగర్ ఫ్యాక్టరీ టెన్షన్‌గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిజాం ఫ్యాక్టరీని తెరిపిస్తామని గతంలో కేసీఆర్ ప్రకటన చేశారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రం ఫ్యాక్టరీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గురిపెడుతున్నాయి.

ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తాము తీసుకువచ్చామని మరి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పిన కేసీఆర్‌కు ఇంకా వందరోజులు పూర్తి కాలేదా అని ఎటాక్ చేస్తోంది. దీంతో పసుపు బోర్డు విషయంలో కేంద్రం ప్రకటన, నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పార్టీలపై ఎలా ఉండబోతున్నది అనేది చర్చగా మారింది.

Tags:    

Similar News