క్రీడల్లో తెలంగాణ ముందుండాలన్నదే లక్ష్యం : మంత్రులు
దిశ, శేరిలింగంపల్లి: జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.
దిశ, శేరిలింగంపల్లి: జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ వాణి దేవి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తదితరులు హాజరై జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో ముందుడాలన్న లక్ష్యంతో త్వరలో తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తామని తెలిపారు. ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ లో బాగా రాణించాలంటే క్రీడా నైపుణ్యం చాలా అవసరమని దానికి అనుగుణంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ పని చేస్తుందన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ను ఆదర్శంగా తీసుకొని క్రీడాకారులు ఆయా క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అందులో భాగంగా మహమ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ లాంటి క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందచేసిందని గుర్తు చేశారు. క్రీడా దినోత్సవ వేడుకలలో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.