టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా బ్రాహ్మిణి!

ఆంధ్రప్రదేశ్‌లో బంపర్ విక్టరీ సాధించిన చంద్రబాబు నాయుడు ఇక తెలంగాణ పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టారు.

Update: 2024-07-11 10:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో బంపర్ విక్టరీ సాధించిన చంద్రబాబు నాయుడు ఇక తెలంగాణ పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టారు. చాలారోజుల తర్వాత ఇటీవలే ఎన్టీఆర్ భవన్‌లో అడుగుపెట్టిన టీడీపీ అధినేత తెలంగాణలోనూ పార్టీని మళ్లీ ట్రాక్ మీదకు తీసుకువస్తానని తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో కోల్పోయిన చోటే తిరిగి సాధించుకోవాలనే వ్యూహంతో తెలంగాణలో మూలకు పడిన సైకిల్‌ను తిరిగి రేస్‌లో పెట్టేందుకు చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నది. పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు, పసుపు శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి పరుగులు పెట్టించే బాధ్యతను తన కోడలికి అప్పగించబోతున్నారని, బ్రాహ్మణిని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ కారిడార్‌లో చర్చ జరుగుతున్నది. ఇందుకు నారా లోకేశ్, బాలకృష్ణ సైతం సుముఖత వ్యక్తం చేశారని, ఇదే విషయంలో ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం నేతలు బాహ్మణితో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

మిషన్ తెలంగాణ కోసం బిగ్ స్కెచ్..

గతవారం హైదరాబాద్‌లో చంద్రబాబు పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్‌ను పెంచింది. తెలంగాణలో టీడీపీ పాత్ర ఎలా ఉండబోతున్నదో అనే దానిపై తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. త్వరలోనే మరోసారి రాష్ట్ర నేతలతో భేటీ అవుతానని చెప్పారు. ఇదే సమయంలో ఇక్కడ పార్టీని నేతలు వీడిపోయారు.. కానీ కార్యకర్తలు వీడలేదనే బలమైన నమ్మకంతో ఉన్న చంద్రబాబు.. పార్టీని పునరేకీకరణ చేసేందుకు బ్రాహ్మణికి కీలక రోల్ ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతల్లో చాలామంది సీనియర్ ఎన్టీఆర్‌ను అభిమానించే వారు ఉన్నారు. పార్టీ యాక్టివ్‌గా లేకపోవడంతోనే వారిలో చాలామంది పక్క పార్టీల్లో చేరారు. వారిలో ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మంత్రి తుమ్మల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికెపుడి గాంధీ ఇటీవల చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ క్రేజ్‌ను మరోసారి గుర్తు చేసిందనే టాక్ వినిపిస్తున్నది. ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ స్థానాన్ని తెలుగుదేశం భర్తీ చేసేలా మిషన్ తెలంగాణకు చంద్రబాబు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది.

క్లిష్ట సమయంలో తానేంటో నిరూపించుకున్న వైనం..

గతేడాది చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సమయంలో లోకేశ్‌ను సైతం అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీకి ఆల్టర్‌నేట్ నేత ఎవరు? అనే అంశం చర్చకు వచ్చినప్పుడు నారా బ్రాహ్మణి పేరు ప్రధానంగా వినిపించింది. ఆ సయమంలో లోకేశ్ ఢిల్లీలో ఉంటూ వ్యవహారాలు చక్కబెడుతుంటే బ్రాహ్మణి మాత్రం ఏపీలో ఉంటూ ఓవైపు అత్త భువనేశ్వరికి ధైర్యం చెబుతూనే మరోవైపు ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు కదం తొక్కేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది. నాడు బ్రాహ్మిణి తీసుకున్న చొరవతోనే పార్టీ శ్రేణులు వైసీపీపై నిరసన గళాన్ని వినిపించాయని, హైదరాబాద్‌లో ఉన్న టీడీపీ అభిమానులు, సెటిలర్స్, ఐటీ ఎంప్లాయిస్‌ను ఏకం చేయడంలో ఆమె ముఖ్య భూమిక పోషించారనే అభిప్రాయాలు పార్టీలో ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో పార్టీ పగ్గాలు బ్రాహ్మణికి అప్పగించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తున్నది.


Similar News