జీఓ 317 సమస్యను వెంటనే పరిష్కరించాలి.. సీఎస్‌ను కోరిన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి

రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న జీఓ 317 సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి కోరారు.

Update: 2024-10-25 12:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న జీఓ 317 సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి కోరారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డిని జేఏసీ పలు అంశాలపై చర్చించింది. అందులో భాగంగా శుక్రవారం లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు సీఎస్ శాంతి కుమారిని కలిసి పలు విషయాలను చర్చించారు. జీఓ 317పై పలు సందేహాలు, సూచనలు చేశారు. ప్రభుత్వం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యపై కేబినేట్ సబ్ కమిటీ వేయడం, సకాలంలోనే కమిటీ నివేదిక ఇవ్వడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే జీవో ద్వారా మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఉద్యోగుల తరపున అభ్యంతరాలను సచివాలయంలో శుక్రవారం జేఏసీ ప్రతినిధులతో కలిసి లచ్చిరెడ్డి అందచేశారు. 317 జీఓకు స్థానికతను కూడా పరిగణలోకి తీసుకోవాలని, కేబినెట్ భేటీలో తాము పేర్కొన్న అంశాలను చర్చించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలో స్పౌజ్, మ్యూచువల్, హెల్త్ గ్రౌండ్ వాళ్లకు న్యాయం చేయాలని ఉన్నట్లుగా తెలుస్తోందని అన్నారు.

317 జీఓను నాడు అడ్డుకోవడంలో ఉద్యోగ సంఘాల నేతలు విఫలం అయ్యారని ఆరోపించారు. 2018‌లో జోనల్ వ్యవస్థ అవగాహన లేకుండా, అంతకు ముందు ఉన్న 5, 6 జోన్లను ఏ జోన్‌కు సంబంధించిన జిల్లాలను ఆ జోన్‌ పరిధిలోనే విభజించి కొత్త జోన్లు చెయాల్సింది. కానీ, అలా చేయకుండా అప్పటి 6వ జోన్‌లోని కొన్ని జిల్లాలు ఉదాహారణకు మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట ఇప్పుడున్న మల్టీ జోన్-1‌కు బదలయాయించారని గుర్తు చేశారు. అదేవిధంగా జనగామ జిల్లాను ఇప్పుడున్న మల్టీ జోన్-2కు బదలాయించారని వివరించారు. 317 జీవోలో భాగంగా ఉద్యోగులను జోనల్ వారీగా సర్దుబాటు చేసే క్రమంలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. అశాస్త్రీయమైన జోనల్ విభజన వల్ల చాలా‌మంది ఉద్యోగులు స్థానికత కోల్పోయారని పేర్కొన్నారు.

అంతే కాకుండా ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతుల్లో చాలా సమస్యలు ఏర్పడే అవకాశం తలెత్తిందని తెలిపారు. ఉద్యోగం చేసే భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాలకు సర్దుబాటు చేశారని గుర్తు చేశారు. స్థానికత కోల్పోయిన ప్రతి ఉద్యోగిని అవసరం అయితే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి వారిని వెంటనే స్థానిక ప్రాంతాలకు సర్దుబాటు చేయాలి. భార్యాభర్తలు ఇద్దరే ఉద్యోగం చేసే పరిస్థితుల్లో ఇద్దరినీ ఒకే ప్రాంతానికి సర్దుబాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ నాయకులు డా.నిర్మల, హన్మంతరావు, డా.కత్తి జనార్దన్, రమేష్ పాక, దర్శన్ గౌడ్, హరికృష్ణ, వివేక్, గరిక ఉపేందర్ రావు, జె.తిరుపతి, శ్రీధర్, సుగంధిని, హేమలత, రాబర్ట్ బ్రూస్, రోహిత్ నాయక్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.


Similar News