Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. భుజంగరావు బిగ్ షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న భుజంగరావుకు బిగ్ షాక్ తగిలింది. బెయిల్ గడువు పెంచాలన్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. రేపు సాయంత్రంలోగా జైలుకు వెళ్లాలని ఆదేశించింది.

Update: 2024-11-13 08:56 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారుతోంది. మొన్న బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే చిరుమర్తికి పోలీసులు నోటీసులివ్వడంతో ఈ కేసుపై మళ్లీ చర్చ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక నిందితుల్లో ఒకరైన భుజంగరావుకు (Bhujangarao) తాజాగా బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకూ ఆయన మధ్యంతర బెయిల్ (Interim Bail) పై ఉండగా.. నేటితో ఆ బెయిల్ గడువు ముగిసింది. బెయిల్ గడువును పొడిగించాలని ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ వేయగా.. దానిపై శుక్రవారం (నవంబర్ 8) వాదనలు పూర్తయ్యాయి. నేటికి తీర్పును రిజర్వ్ చేశారు. నేడు భుజంగరావును పోలీసులు కోర్టులో హాజరు పరచగా.. ఆయన బెయిల్ ను రద్దు చేస్తూ నాంపల్లి కోర్టు (Nampally Court) ఆదేశాలిచ్చింది. రేపు (గురువారం) సాయంత్రం 4 గంటల్లోగా జైలుకు వెళ్లాలని భుజంగరావుకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న భుజంగరావు అనారోగ్య కారణాలతో ఈ ఏడాది ఆగస్టు 19న మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇటీవలే ఆయనకు గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరగ్గా.. వైద్యులు అందుకు చికిత్స అందిస్తున్నారని, బెయిల్ గడువును పెంచాలని కోరారు భుజంగరావు న్యాయవాది. కానీ.. పీపీ వారి రిక్వెస్ట్ కు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు గడువు పెంచారని, మరోసారి పొడిగిస్తే కేసులో సాక్ష్యుల్ని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని వివరించారు. ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. భుజంగరావు బెయిల్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. ఈ కేసులో ఏ1 నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా అతనిపై ఇటీవలే రెడ్ కార్నర్ నోటీసులు (Red Corner Notice) జారీ అయ్యాయి.

Tags:    

Similar News