మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు : మంత్రి దామోదర రాజనర్సింహా

మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ(చిట్యాల ఐలమ్మ) పేరు పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు.

Update: 2024-12-18 16:47 GMT

దిశ; తెలంగాణ బ్యూరో :  మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ(చిట్యాల ఐలమ్మ) పేరు పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. బుధవారం ఆయన శాసన మండలిలో బిల్ ప్రవేశ పెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీకి పెట్టడం ఆనందంగా ఉన్నదన్నారు. ఆమె చేసిన పోరాటం ఎంతో మంది మహిళలకు స్పూర్తి అని పేర్కొన్నారు. యూనివర్సిటీకి ఆమె పేరును పెడుతూ బిల్లు పెట్టే అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని వివరించారు. తన స్టూడెంట్ లైఫ్‌లో ఎన్నోసార్లు ఐలమ్మ పోరాట చరిత్ర గురించి చర్చ జరిగిందని, ఆ పోరాటం తనలాంటి ఎంతోమందికి స్పూర్తినిచ్చిందన్నారు. 75 సంవత్సరాల కిందట సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్ష, ఎన్నో అవమానాలను ఎదొర్కొని.. దొరలు, జమిందార్లను ఎదిరించి పోరాడడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.

సమాజానికి, భావితరాలకు స్పూర్తిదాయకులు, దార్శనికులు అవసరమన్నారు. వారి పేరు ఎత్తితే వారి చరిత్ర, వారు చేసిన పోరాటం గురించి పిల్లలు తెలుసుకుని స్పూర్తి పొందుతారన్నారు.భావితరాలను తీర్చిదిద్దేది మహిళలేనని, వారికి చదువు చాలా ముఖ్యమన్నారు. అయితే చదవు ఒక్కటే జీవితాలను మార్చదనీ, సాంస్కృతిక అంశాలు, చరిత్ర, సమకాలీన అంశాలపై కూడా మహిళలకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. కుటుంబాలు సమర్ధవంతంగా ముందుకు సాగడంలో మహిళ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కంప్యూటర్, సాప్ట్ వేర్ యూగంలోనూ ఇంకా అసమానతలు, సాధికారత, 33 శాతం రిజర్వేషన్లు కోసం మహిళలు ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు. ఇక సమాజంలో వ్యవస్థ అనేది పర్మినెంట్ అని, వ్యక్తులు కానేకాదని వివరించారు. స్పష్టమైన ఐడియాలజీ తో ముందుకు సాగాలన్నారు. సమాజానికి మన కాంట్రిబ్యూషన్ ఏమిటీ? అంటూ ప్రతీ వ్యక్తి తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. అప్పుడే రాబోయే తరాలకు మంచి జరుగుతుందన్నారు. బిల్లుకు మద్ధతిచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.


Similar News