పంట నష్టం నివేదికలో పేరుందా..? రైతులలో తీవ్ర ఆందోళన

అకాల వర్షం రైతన్నలను ఆగమాగం చేసిన విషయం తెల్సిందే.

Update: 2023-05-12 04:06 GMT

అకాల వర్షం రైతన్నలను ఆగమాగం చేసిన విషయం తెల్సిందే. యాసంగి పంటలకు సంబంధించి ప్రధానంగా వరి, మొక్కజొన్న, నువ్వుల పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ప్రభుత్వం పంట నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని ప్రకటించింది. మార్చి మాసానికి సంబంధించిన పంట నష్టం జాబితాను ఉమ్మడి జిల్లా నుంచి పంపిన అధికారులు ఇటీవల కురిసిన వర్షం పంట నష్టం సేకరణకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మార్చి నెలలో జరిగిన పరిశీలనలో క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు పప్పులో కాలు వేశారు. బోధన్ డివిజన్ లో జరిగిన పంట నష్టంలో రైతు వరి పంట వేస్తే రికార్డులో మాత్రం సన్ ఫ్లవర్ సాగు చేశారని రాయడంతో రైతు పూర్తి వివరాలను తెలపడంతో అగ్రిక్చలర్ అధికారులు నాలుక కర్చుకున్నారు. కొత్తగా జరుగుతున్న పంట నష్టం వివరాలను ఇప్పటికీ ప్రకటించకపోవడం, ప్రభుత్వం 30 శాతం నిబంధన, కౌలు రైతులకు పరిహారం దక్కదన్న బాధ రైతులను వేధిస్తోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : యాసంగి సీజన్‌లో గత 25 రోజులుగా కురిసిన అకాల వర్షంతో పంటలు దెబ్బతినడంతో పాటు కోసిన వరి ధాన్యం కల్లాలలో, రోడ్లపై, కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి ముద్దయిన విషయం తెలిసిందే. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఈ నెల 7న బీష్మించిన మిల్లర్లు జిల్లా కలెక్టర్‌తో జరిగిన సమావేశం నేపథ్యంలో సీఎంఆర్ లోడింగ్‌కు అంగీకరించిన విషయం తెలిసిందే. తడిసిన ధాన్యం తీసుకున్న, ఎఫ్‌సీఐ నిబంధనల నేపథ్యంలో తమకు గిట్టుబాటు కాదని గతంలో ప్రకటించినట్లు బస్తాకు మూడు నాలు గు కిలోల నూకకు అనుమతి ఇవ్వాలని కోరిన విషయం తెల్సిందే.

తడిసిన ధాన్యం విషయంలో ప్రత్యేకంగా సంబంధిత ధాన్యాన్ని తీసుకురావాలని సివిల్ సప్లయ్ శాఖ రైతులను కోరారు. కానీ కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని తేమ కలిగిన ధాన్యాన్ని కలిపి లోడింగ్ చేయడంతో మిల్లర్లు వాటిని అన్‌లోడింగ్ చేయడానికి కొర్రీలు పెట్టారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని ప్రత్యేకంగా బాయిల్ మిల్లర్లకు ఇచ్చి సర్ధుబాటు చేయాలని యోచన కాగా అది సాధ్యం కాకుండా పోయింది. అందుకు సోసైటీలే ప్రధాన కారణమని చెప్పాలి. ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యం విషయంలో తేమ కోసం రైతులు ఇప్పటికి వాటిని ఎండకు ఆరబోసి ఎదురు చూస్తున్నారు.

ఏప్రిల్, మే మాసాల్లో నిజామాబాద్ జిల్లాలో 31, 567 ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 63 వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అందులో 30 శాతానికి మించి పంట నష్టపోయిన వారికి మాత్రమే పరిహారం ఇస్తామని ప్రకటించడంతో ఆ నిధులు ఎప్పుడు వస్తాయని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మార్చి నెలకు సంబంధించిన కేవలం 467 ఎకరాల పంట నష్టాలకు 46 లక్షల పరిహారం మంజూరు కాగా రైతుల ఖాతాలో నమోదుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గత 25 రోజులుగా కురిసిన అకాల వర్షంతో ప్రధానంగా వరి పంటకు తీవ్ర నష్టం జరుగడంతో కోత కోసి నూర్పిడి చేసిన చేతికి రాని పంట పరిస్థితులు ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరట్ పల్లిలో సుమారు 500 ఎకరాల్లో పంట ఒక్క విత్తు కూడా చేతికి రాకుండా పోయింది. అలాంటి ప్రాంతాల్లో నష్టపరిహారం వస్తుంది కానీ మిగిలిన ప్రాంతాల్లో అగ్రికల్చర్ అధికారులు గ్రామీణ స్థాయిలో ఏఈవోల ద్వారా చేసిన సర్వేలలో తమ నష్టపరిధిలోకి తమ పేరు వచ్చిందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఉమ్మడి జిల్లాలో లక్షా ఎకరాల్లో పంట నష్టాలు జరుగగా దాదాపు 95వేల ఎకరాల్లో వరి వంగిపోయింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారుల తుది జాబితా కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అందిస్తామన్న రూ.10 వేల పరిహారం ఏ మూలకు సరిపోదని ఎంతో కొంత వస్తుందని ఆశపడితే 30 శాతం నిబంధన రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

Tags:    

Similar News