జీరో కరెంట్ బిల్లు వచ్చేదెట్ల..? తిప్పలు తప్పవా…
నూతనంగా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలోని అభయహస్తం పథకంలో గృహ జ్యోతి దరఖాస్తులు చేసుకున్న బాధితుల కష్టాలు, తీర్చేది ఎన్నడు.?
దిశ, వలిగొండ: నూతనంగా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలోని అభయహస్తం పథకంలో గృహ జ్యోతి దరఖాస్తులు చేసుకున్న బాధితుల కష్టాలు, తీర్చేది ఎన్నడు.? జీరో కరెంట్ బిల్లు వచ్చేది ఎట్లా? తిప్పలు తప్పవా? దరఖాస్తు దారులు ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోగా ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో తంటాలు వచ్చి పడ్డాయి. అనుభవం లేని ఆపరేటర్లతో తిప్పలు తప్పటం లేదు. గ్రామాల్లో. పట్టణాల్లో జీరో బిల్లు కొందరికి వచ్చి కొందరికి రాకపోవడంతో విద్యుత్ అధికారులను అడుగగా మాకు ఏమి తెలియదు అని సమాధానం చెబుతున్నారు. మేము రీడింగ్ తీసి బిల్ ఇస్తున్నాం. జీరో బిల్లు వస్తుందో, రాదో మాకు తెలియదు అంటున్నారు. తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సమాధానం ఇవ్వడంతో మళ్లీ అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రజల వద్దకే పాలన అని ప్రకటించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
నియమాలన్నీ గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి అధికారుల పనితీరుపై ఆరా తీయాలని ప్రజలు కోరుతున్నారు. వలిగొండ మండలంలో మొత్తం ఆవాస గ్రామాలతో కలిపి 37 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో వందలాది మంది జీరో బిల్లు బాధితులు ఉన్నారు. ప్రభుత్వం జీరో బిల్లు, అభయహస్తం లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించడంతో లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని ఎండలో ఎదురు చూడాల్సి వస్తుంది.