సర్వే సవ్యంగా సాగేనా..ఆందోళనలో ఎస్జీటీలు..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేకు

Update: 2024-11-13 02:29 GMT

దిశ,చిలుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.. ఖరీఫ్ సీజన్ కోతల కాలం కారణంగా గ్రామాల్లో రైతులు, కూలీలు ఇళ్ల దగ్గర ఉండటం లేదు.. దీంతో ఎన్యూమరేటర్లకు వివరాలు సేకరించడం కష్టతరంగా మారింది.. సర్వే పూర్తి చేయడానికి ప్రభుత్వం నెల రోజుల గడువే ఇవ్వడంతో ఉపాధ్యాయులు కొందరు అరకొర సమాచారమే సంబంధిత పత్రాల్లో పొందుపరుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. దీంతో సర్వే సమగ్రత దెబ్బ తినే ప్రమాదం కనిపిస్తోంది.. ఇప్పటికే ఈ సర్వేపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.. సర్వే కాలాన్ని పొడిగిస్తే సమగ్ర వివరాలు అందుబాటులోకి వస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

కుటుంబ ఆర్థిక, సామాజిక, కుల గణన లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి సమగ్ర సర్వే చేపట్టింది. ఇందుకు గానూ ప్రాథమిక పాఠశాలల ఎస్జీటీ ఉపాధ్యాయులను ఎన్యూమరేట్లుగా నియమించింది. వీరందరికీ జిల్లా అధికారులు శిక్షణ కూడా ఇచ్చారు. దాదాపు 80 ప్రశ్నలతో వీరు ఇంటింటి సర్వేను నిర్వహించాలి. ఈ కారణంగా పాఠశాలలను మధ్యాహ్నం 1 గంట వరకే నిర్వహిస్తున్నారు. పాఠశాల సమయం ముగిసిన అనంతరం సంబంధిత ఉపాధ్యాయులు (ఎన్యూమరేట్లు) తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి సమగ్ర వివరాలతో కూడిన సర్వే నిర్వహించాలి.

 ఒక్కో ఎన్యూమరేటర్ కు 175- 180 ఇళ్లు..

ఈ సర్వేలో భాగంగా ఒక్కో ఎన్యూమరేట్ కు 175 నుంచి 180 ఇళ్లు కేటాయించారు. ఒక్కో కుటుంబం సమగ్ర వివరాలు సేకరించేందుకు 30- 45 నిమిషాలు పడుతుంది. ఒక్క కుటుంబానికే ఇంత సమయం కేటాయించడం, సంబంధిత కుటుంబ సభ్యుల దగ్గర పూర్తి వివరాలు లేకపోవడంతో వివరాల సేకరణ కష్టంగా మారింది.

ముమ్మరంగా వరి కోతలు..

ఖరీఫ్ సీజన్ వరి కోతల కాలం కావడంతో రైతులు, కూలీలు ఉదయం 5 గంటల వరకు చేలల్లోనే ఉంటున్నారు. వరి కోత మిషన్లు సమయానికి అందుబాటులో లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారంతా సాయంత్రం 6 తర్వాతనే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎన్యూమరేట్లు మధ్యాహ్నం 1 గంటకు కుటుంబ సర్వేకు వెళితే కుటుంబ పెద్దలు అందుబాటులో లేని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వారు ఏం చేయలేని పరిస్థితి. మధ్యాహ్నం 1 గంటకే పాఠశాలలు మూసి వేస్తుండడంతో ఉపాధ్యాయులు.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరసనలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నానాటికీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న ఈ తరుణంలో పాఠశాలలను మధ్యాహ్నం 1 గంటకే మూసివేస్తుండడం పాఠశాలల మనుగడకు అశనిపాతంగా మారిందనడంలో సందేహం లేదు..

ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేయవద్దు..: కొండా రామాంజనేయులు, ఎస్జీటీ యూ, జిల్లా ప్రధాన కార్యదర్శి.

సర్వేలో ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలి. రైతులు కోతల పనుల్లో నిమగ్నమైనందున సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు.. ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేయవద్దు. సర్వే కాలాన్ని పొడిగిస్తే సమగ్ర వివరాలు సేకరించేందుకు అనుకూలంగా ఉంటుంది.


Similar News