సీఎం మీటింగ్ కు రాని లీడర్లు ఎటువైపు...?
ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా మునుగోడులో నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభకు మునుగోడు నియోజకవర్గం నుంచి అధికంగా స్థానిక లీడర్లు గైరాజరయ్యారు.
దిశ ,మర్రిగూడ: ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా మునుగోడులో నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభకు మునుగోడు నియోజకవర్గం నుంచి అధికంగా స్థానిక లీడర్లు గైరాజరయ్యారు. ప్రస్తుతం వారు బీఆర్ఎస్ లో ఉంటారా..? పార్టీ మారుతారా..? బీఆర్ఎస్ లో ఉంటే కూసుకుంట్లకు పని చేస్తారా..? పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీకి పనిచేస్తారా ..? అనే ప్రశ్నలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి. మొదటి నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నీ వ్యతిరేకిస్తూ ఒక వర్గం పని చేస్తూనే ఉంది. మునుగోడు బై ఎలక్షన్ లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్టు ఇవ్వొద్దని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు వ్యతిరేకించిన సంగతి పాఠకులకు విధితమే.మునుగోడు బై ఎలక్షన్ లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ మళ్లీ అధిష్టానం టికెట్టు ఇవ్వడంపై అసమ్మతి వర్గం అధిష్టానం పై గుర్రుగా ఉంది.
ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని అన్ని మండలాల నుంచి అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయినా అధిష్టానం ఎవరి వినతులు, స్వీకరించకుండా డోంట్ కేర్ అనే రీతిలో టికెట్టు కేటాయించడం వారిన తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా మునుగోడు లో సీఎం ప్రజా ఆశీర్వాద సభకు మునుగోడు మండలంలోని కూసుకుంట్లపై వ్యతిరేకంగా ఉన్న అసమ్మతి వర్గ నాయకులు ఏ ఒక్కరూ హాజరు కాలేదు. అలాగే నాంపల్లి ఎంపీపీ గా ఉన్న ఆయన బంధువు సైతం మీటింగ్ కి నామమాత్రంగా హాజరైనా, కూసుకుంట్లపై ఉన్న వ్యతిరేకతతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి వర్గంను అధిష్టానం దగ్గరికి తీసుకుంటుందా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా మార్చుతారా మార్చకపోతే పార్టీకి జరిగే నష్టం ఎలా ఉంటుందో అధిష్టానమే ఆలోచించాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు.
ఓడిపోయే వ్యక్తికి టికెట్టు ఎందుకిచ్చారని అధిష్టానంపై ఆగ్రహం
మునుగోడు బై ఎలక్షన్ లోనే రాష్ట్ర క్యాబినెట్‌లో ఉన్న మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తోపాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రచారం చేసినప్పటికీ మునుగోడులో అధికార పార్టీ అభ్యర్థి పదివేల మెజార్టీతో మాత్రమే గెలుపొందాడని, సీఎం ఓడిపోయే వ్యక్తికి ఎలా మళ్లీ సీటు ఇస్తారని స్థానిక అసమ్మతి వర్గం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం ప్రజా ఆశీర్వాద సభకు ప్రధానమైన అన్ని మండలాల లీడర్లు హాజరు కాలేదు. అయినా ఇప్పటివరకు అధికార పార్టీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని తాము పార్టీ మారడం ఖాయమని అసమ్మతి వర్గం బాహటంగానే పేర్కొనడం గమనార్హం.
బై ఎలక్షన్‌లోనే తప్పు చేశామని అసమ్మతి వర్గం ఆరోపణ:
మునుగోడు బై ఎలక్షన్ లోనే కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని స్వీకరించి తప్పు చేశామని ఆయన పైన ఉన్న అసమ్మతి వర్గం ఆరోపిస్తుంది. పార్టీ అధిష్టానంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికి ఇన్చార్జిగా ఉండి అధికార పార్టీని గెలిపించాలని పెద్ద ఎత్తున బుజ్జగింపుల పర్వానికి పాల్పడటంతో సపోర్టు చేసి తప్పు చేశామని అసమ్మతి వర్గం ఆరోపిస్తుంది. అప్పుడే అధిష్టానానికి కూసుకుంట్లపై ఉన్న వ్యతిరేకతను తెలియజేసినప్పటికీ ఈ ఒక్కసారి చేయాలని బుజ్జగించారని అసమ్మతి వర్గం ఆరోపిస్తుంది. ప్రతి మండలంలో ఒకరిని ఇన్చార్జిగా పెట్టుకుని వారి నుంచి విచ్చలవిడిగా లంచాలు వసూలు చేస్తూ అధికారులను పార్టీ కార్యకర్తలను కూడా వదలకుండా విచ్చలవిడిగా లంచాలు వసూలు చేశారని అధిష్టానానికి విన్నవించిన అభ్యర్థిని మార్చకపోవడంతో తాము అధిష్టానం పై తీవ్ర వ్యతిరేకతో ఉన్నామని అసమ్మతి వర్గం ఆరోపిస్తుంది.
కూసుకుంట్లకు వీరు సపోర్టు చేస్తారా...?
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఈ అసమ్మతి నేతలు సపోర్టు చేస్తారా.. ? చెయ్యకపోతే ఈయన పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కార్యకర్తల్లో ఉత్పన్నమవుతుంది. కూసుకుంట్లపై వ్యతిరేకంగా ఉన్న ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూప రాణి చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు , కర్నాటి విద్యాసాగర్, నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగూటి వెంకటేశ్వర రెడ్డి, నాంపల్లి ఎంపీపీ పానుగంటి రజనీ వెంకన్న గౌడ్ , నారాయణపురం ఎంపీపీ ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణ లింగస్వామి గౌడ్ , చెరుకు కృష్ణయ్య , ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ రఫీ, కో ఆప్షన్ సభ్యులు వనం నిర్మల యాదయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేనపల్లి వెంకటేశ్వరరావు, సర్పంచి చెల్లమల్ల వెంకట్రెడ్డి , మాజీ జెడ్పీటీసీ బొల్లా శివశంకర్, ఎంపీటీసీ రాజు నాయక్, నారాయణపురం సర్పంచి శికిలమెట్ల శ్రీహరి,టెంపుల్ చైర్మన్ సిద్దిపేట శేఖర్ రెడ్డి , మాజీ సర్పంచి బొంగు జంగయ్య గౌడ్, పిల్లల మర్రి శ్రీనివాస్ తోపాటు సీనియర్ నాయకులు 20 మందికి పైగా ఎంపీటీసీలు 40 మంది సర్పంచులు, పలువురు ఉన్నట్లు స్పష్టమవుతుంది.
కూసుకుంట్ల దగ్గర బంధువే పార్టీ మారుతాడని ప్రచారం..!
మునుగోడు ఎమ్మెల్యే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దగ్గరి బంధువే పార్టీ మారుతాడని ప్రచారం జోరుగా సాగుతోంది. బై ఎలక్షన్ తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అడ్డగోలుగా డబ్బులు సంపాదించడానికి మరిచి ప్రతి ఒక్కరిని పీడించడంతో ఆయన దగ్గర బంధువే ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన తన భార్యతో కలిసి తన అనుచరులైన ఎంపీటీసీలు సర్పంచులతో కలిసి పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం కూసుకుంట్లను మారుస్తారా లేదా మార్చకపోతే తామే పార్టీ మారుతామని హెచ్చరిస్తున్నారు.