నకిరేకల్ కాంగ్రెస్‌లో కల్లోలం.. క్షేత్ర స్థాయిలో బలమున్న నో యూస్!
విభేదాలు వీడుతాం.. ఐక్యంగా సాగుతాం.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. టికెట్ ఎవరికీ ఇచ్చినా గెలిపించుకుంటాం.. కేసీఆర్ ను గద్ద దింపడమే మా లక్ష్యం.. అంటూ ఒకవైపు అగ్రనాయకులు ప్రకటిస్తుంటే..
దిశ, నకిరేకల్: విభేదాలు వీడుతాం.. ఐక్యంగా సాగుతాం.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. టికెట్ ఎవరికీ ఇచ్చినా గెలిపించుకుంటాం.. కేసీఆర్ ను గద్ద దింపడమే మా లక్ష్యం.. అంటూ ఒకవైపు అగ్రనాయకులు ప్రకటిస్తుంటే.. మరోవైపు నకిరేకల్ నియోజకవర్గంలో నాయకుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సాగుతోంది. టికెట్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకులు తలా ఒక దారిని ఎంచుకొని క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో క్యాడర్ ఉన్నా ఫలితం సున్నా అన్న రీతిలో మారిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. 2018 ఎన్నికల నాటి నుంచి నేటికీ నియోజకవర్గ ఇన్చార్జి పెట్టలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది.
ఇది పరిస్థితి...
2018 ఎన్నికల్లో గెలిచిన చిరుమర్తి లింగయ్య పార్టీ మారిన తర్వాత పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఈ సమయంలో 2009 నుంచి టికెట్ ఆశిస్తున్న కొండేటి మల్లయ్య, ధైద రవీందర్ తామున్నామంటూ కార్యకర్తలకు మనోధైర్యం నింపుతున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని అడపా దడపా చేస్తూనే ఉన్నారు. పార్టీ ఉనికి కోల్పోకుండా కార్యక్రమాలను ముందుకు సాగిస్తున్నారు. కానీ ఒకరు మాత్రం వెంకట్ రెడ్డి వర్గంగా, మరొకరు జానారెడ్డి, రేవంత్ రెడ్డి వర్గంగా గ్రూపులుగా విడిపోయి క్యాడర్ను విభజిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సైతం ఇరువురు నేతలు క్యాడర్ ను విభజిస్తూ స్వాగతం పలికారు. ఇలా సమన్వయం లేకపోవడంతో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నియోజకవర్గంలో అంతగా ఆదరణ దక్కలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
దీనికి తోడు నకిరేకల్ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గట్టి పట్టు ఉంది. అయినా సీఎల్పీ నేత చేపట్టిన పాదయాత్ర నియోజకవర్గంలో నాలుగు రోజులు సాగిన వెంకటరెడ్డి హాజరు కాలేదు. అనారోగ్య కారణాల రీత్యా రెండు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉన్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, విహెచ్ లాంటి నాయకులు విక్రమార్కను పరామర్శించారు. అయినా వెంకట్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనకపోవడంతో క్యాడర్ నారాజు చెందినట్లు తెలుస్తోంది. దీనంతటికీ కారణం నియోజకవర్గంలో నాయకుల మధ్య ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలే కారణంగా అర్థమవుతుంది.
సంబంధం లేకున్నా.. పోటీ చేస్తానంటూ..
ఇప్పటికే గ్రూపులతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీలో సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య తాను పోటీ చేస్తానంటూ హడావిడి చేస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నారంటూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తనకు వయసు రీత్యా అధిష్టానం అడ్డు చెప్తే ఇబ్బందులు లేకుండా తన కొడుకుని సైతం నియోజకవర్గంలో పర్యటింప చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఆశిస్తున్నారు అర్థం కాకుండా క్యాడర్ ను అయోమయం చేస్తున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గానికి వీరికి ఎటువంటి సంబంధం లేకపోవడంతో క్యాడర్ సైతం వీరిని విశ్వసించనీయట్లేదని తెలుస్తోంది.
కానీ ఇటీవల నార్కట్‌పల్లి మండలంలో నిర్వహించిన వెంకట్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెంకట్ రెడ్డి ఆశీస్సులు పొందేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. అయినప్పటికీ ఇప్పటికే నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోయిన క్యాడర్ మాత్రం ఎవరికి సపోర్ట్ చేస్తారో అంతుచిక్కని ప్రశ్నగా మారిపోతుంది. కేవలం డబ్బు ప్రామాణికంగానే తమకు టికెట్ దక్కుతుందని ఆశలు వీరు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పారాషూట్ నాయకులకు టికెట్లు ఇవ్వొద్దంటూ ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న వారు హై కమాండ్ కు కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది.
చెరుకు పరిస్థితి ఏంటి...?
కెసిఆర్ వైఖరిని నిరసిస్తూ ఇంటి పార్టీని ఏర్పాటు చేసిన చెరుకు సుధాకర్ సైతం ఇదే నియోజకవర్గానికి చెందిన నాయకుడు. గత ఎన్నికల్లో ఆయన భార్య ఎస్సీ కావడంతో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేశారు. కాగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంతో చెరుకు సుధాకర్ ఇంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చెరుకు తన భార్యకు టికెట్ కోసం పోటీలో ఉంటాడా? లేక మరో అభ్యర్థిని సూచిస్తాడా? అనే సందిగ్ధం నెలకొంది. ఇదిలా ఉంటే చెరుకు సుధాకర్‌కు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో పార్టీ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి : Bandi Sanjay Kumar : బండికి హైకమాండ్ పిలుపు.. హుటాహుటిన ఢిల్లీ బయలుదేరిన BJP స్టేట్ చీఫ్..!