నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు.. తాత్కాలిక పనులతో రూ. లక్షల్లో ఖర్చు
గత ప్రభుత్వ హయాంలో సూర్యాపేట జిల్లాలో భారీగా క్రీడా ప్రాంగణాలు
దిశ,సూర్యాపేట టౌన్: గత ప్రభుత్వ హయాంలో సూర్యాపేట జిల్లాలో భారీగా క్రీడా ప్రాంగణాలు నిర్మించిన పనుల్లో నాణ్యత లోపం, నిర్వహణ లేమి, అన్నిటికంటే మించి ఊరికి దూరంగా ఈ క్రీడా మైదానాలు నిర్మించడంతో అన్ని నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం ఆయా క్రీడా ప్రాంగణాలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. క్రీడాకారులతో కళకళలాడాల్సిన ఆయా ప్రాంతాలు ప్రస్తుతం చెత్తకుప్పలు, పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వాటి వైపు కన్నెత్తి చూసే వారు లేకపోవడంతో గతం లో క్రీడా ప్రాంగణాల పేరుతో ఏర్పాటు చేసిన బోర్డు లు,ఐరన్ పోల్స్ తుప్పు పట్టిపోయే స్థితికి చేరుకున్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు ఆటస్థలం కల్పించాలని ఉద్దేశంతో గత ప్రభుత్వంలో రూ. కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు నేడు నిష్ఫలంగా మారాయి.
అనువుగాని స్థలలలో ఏర్పాటు..
గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సంకల్పించి అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద పంచాయతీల్లో ఎకరం, చిన్న పంచాయతీల్లో అరకరానికి తగ్గకుండా ఉండేలా మైదానాన్ని ఎంపిక చేసి వాటిల్లో కబడ్డీ, వాలీబాల్,కోకో లాంగ్ జంప్, క్రీడల కోసం కోర్టులను నిర్మించాలని నిర్ణయించారు. అందుకుగాను ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ. నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు నిధులు కేటాయించారు. ఆ నిధులతో స్థలాలను చదును చేయడం,అవసరమైన ప్రాంతాన్ని మట్టితో నింపడం ప్రాంగణాల చుట్టూ మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. క్రీడా ప్రాంగణాన్ని గ్రామంలో కానీ గ్రామ సమీపంలో కానీ నిర్మించాల్సి ఉంటుంది. అయితే స్థలాల ఎంపిక నుంచే ఈ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు గాడి తప్పింది. అప్పట్లోనే స్థలాల ఎంపికను అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఏదో ఒక స్థలాన్ని సేకరించి అప్పగిస్తే తమ పని అయి పోతుందన్న రీతిలో అధికారులు వ్యవహరించారు. చెరువు శిఖం భూములు,రాళ్లు రప్పలతో కనీసం నడవడానికి కూడా వీలులేని స్థలాలను క్రీడా ప్రాంగణాలకు ఎంపిక చేశారు. క్రీడా మైదానాలు పది కాలాలపాటు పిల్లలకు ఉపయోగపడాల్సింది పోయి అసలు పిల్లలే అటువైపు వెళ్లలేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం గమనార్హం.
అమల్లో అలసత్వం..
సూర్యాపేట జిల్లాలో జిల్లాలోని పలు మండల కేంద్రాల పాటూ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆ తర్వాత నిధులు సక్రమంగా అందించలేకపోవడం కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు దొరకకపోవడం వంటి కారణాలతో క్రీడా ప్రాంగణాల వాటి సంఖ్యను తగ్గించుకుంటూ తక్కువ క్రీడ ప్రాంగణాలను కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేశారు.
వాటితో పాటుగా పట్టణాల్లో సైతం ఇదే తరహాలో నిధులు ఖర్చు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు నాలుగు డివిజన్లలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక్క ప్రాంతానికి రూ.నాలుగు లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. మిగిలిన పట్టణాల్లో ఇదే తరహాలో ప్రాంగణాలు నిర్మించగా ఖర్చు కూడా అదే స్థాయిలో చేసినట్లు లెక్కలు చూపి మూడింతల నిధులు మింగేశారన్న బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాలు లేక పోవడంతో స్థలాలను లీజుకు తీసుకుని మరి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆయా స్థలాలకు లీజులు చెల్లించకపోవడంతో యజమానులు తన సొంత అవసరాలకు ఆ స్థలాలను వాడుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో క్రీడా ప్రాంగణాలపై దృష్టి సారించి వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.