త్రిబుల్ ఆర్ నిర్వాసితులకు నిరాశ !
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు టెండర్ ప్రక్రియ ప్రారంభంతో త్రిబుల్ ఆర్ నిర్వాసితుల ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది.
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు టెండర్ ప్రక్రియ ప్రారంభంతో త్రిబుల్ ఆర్ నిర్వాసితుల ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది. టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయడంతో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఉత్తర భాగానికి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడంతో రాయగిరి, చౌటుప్పల్ ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు గుండెల్లో దడ మొదలైంది. అలైన్మెంట్ ను మార్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు పట్టుబట్టుకు కూర్చున్నారు. తరచూ ఆందోళనలు చేస్తూ పోరాటాలు చేస్తున్నారు. ట్రిబుల ఆర్ నిర్వాసితులు ఎక్కని కోర్టు మెట్లు లేవు.. వారిని రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకోని రాజకీయ పార్టీ లేదు. బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల సారథ్యంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సంతకాలతో అలైన్మెంట్ మార్చాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కూడా పలుమార్లు విన్నవించారు. కేంద్ర మంత్రులే హామీ ఇవ్వడంతో అలైన్మెంట్ మార్పు పై ఆశలు పెట్టుకున్న త్రిబుల్ ఆర్ నిర్వాసితులకు నిరాశే మిగులుతుంది.
161 కి.మీ లకు టెండర్లు : రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఉత్తర భాగంలో 161 కిలోమీటర్ల మేరకు టెండర్లు పిలిచారు. ఐదు బిట్లుగా టెండర్లు స్వీకరించనున్నట్లు సమాచారం. ఇందులో భువనగిరి, చౌటుప్పల్ మండలాలు కూడా ఉన్నాయి. ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు 43 కిలోమీటర్లు, రాయగిరి నుంచి చౌటుప్పల్ మండలం తంగేడుపల్లి వరకు 35 కిలోమీటర్లు ఈ టెండర్లలో ఉన్నాయి. అయితే టెండర్లు పిలవడంతో త్రిబుల్ ఆర్ నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చాలని పదేపదే విన్నవించుకున్న ప్రభుత్వం పట్టించుకోకుండా టెండర్లు పిలవడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇలా : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదు మండలాల నుంచి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల మీదుగా మొత్తం 59.33 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, కోనాపూర్, దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్, వేల్పల్లి, యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపూర్, దాతర్ పల్లి, భువనగిరి మండలంలోని రాయగిరి, కేసారం, పెంచికళాపహాడ్, తుక్కాపూర్, గౌస్ నగర్, ఎర్రంబెల్లి, వలిగొండ మండలంలోని పైల్వాన్ పురం, రెడ్లరేపాక, పొద్దుటూరు, వర్కట్ పల్లి, గోకారం, చౌటుప్పల్ మండలంలోని చిన్న కొండూరు, చౌటుప్పల్, తాళ్ల సింగారం, లింగోజిగూడెం, నేలపట్ల, తంగడపల్లి మీదుగా ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. రీజనల్ రింగు రోడ్డు నిర్మాణానికి 235 హెక్టార్ల భూమిని సేకరించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు సంబంధించి 47.18 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ ముగిసింది. ఈ భూములకు సంబంధించి అవార్డు విచారణ పూర్తయి జాతీయ రహదారుల అధికారులకు నివేదిక సమర్పించినట్లు సమాచారం.
ఆందోళనలో నిర్వాసితులు.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి మండలాలలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భువనగిరి మండల పరిధి యాదాద్రి కి దగ్గరగా ఉండడం, చౌటుప్పల్ విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండడం వలన భూముల ధరలు మార్కెట్లో రూ.కోట్లలో పలుకుతున్నాయి. ఇప్పటికే నేషనల్ హైవే అధికారులు రెండోసారి అలైన్మెంట్ మార్చి నోటిఫికేషన్ ద్వారా భూములు సేకరిస్తుండడంతో రైతులు నష్టపోతున్నామని 27 మంది రైతులు హైకోర్టులో ఏడాదిన్నర కింద రిట్ పిటిషన్ వేశారు. ఈ రిట్ పిటిషన్ ను హైకోర్టు రెండు నెలల కింద కొట్టి వేయడంతో భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. అవార్డు విచారణకు నోటీస్ జారీ చేసినప్పటికీ చౌటుప్పల్, భువనగిరి రైతులు హాజరు కాలేదు. మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అవార్డు విచారణను బహిష్కరించిన నిర్వాసితులు..
త్రిబుల్ ఆర్ నిర్వాసిత రైతులు ప్రభుత్వం ప్రకటించిన అవార్డు విచారణను బహిష్కరించి కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే అవార్డు విచారణను బహిష్కరించిన నిర్వాసితులకు జనరల్ అవార్డు పాస్ చేయనున్నట్లు సమాచారం. అవార్డు విచారణకు వెళ్లని నిర్వాసితులకు జనరల్ అవార్డు పాస్ చేసి జాతీయ రహదారుల అధికారులకు పంపించనున్నారు. అవార్డు అంగీకరించిన నిర్వాసితులకు పరిహారం డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తారు. అవార్డు అంగీకరించని భూ నిర్వాసితుల డబ్బులను భూసేకరణ అధికారి ఖాతాలో జమ చేసి ఉంచుతారు. వలిగొండ మండలం అవార్డు విచారణ చేసి జాతీయ రహదారి రాష్ట్ర విభాగానికి రెండు నెలల కిందటే నివేదిక పంపినట్లు సమాచారం. అయితే చౌటుప్పల్, భువనగిరి మండలాలలో అవార్డును అంగీకరించని భూ నిర్వాసితుల డబ్బులను జనరల్ అవార్డు పాస్ చేసి అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
త్రిబుల్ ఆర్ ఇష్యూని వాడుకున్న రాజకీయ పార్టీలు..
రీజనల్ రింగ్ రోడ్డు అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు వారికి అనుకూలంగా మలుచుకున్నాయి. గత ఏడాది ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై రీజనల్ రింగ్ రోడ్డు రైతుల పక్షాన నిలబడి దుమ్మెత్తి పోశాయి. కొంతమంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రిని అడ్డగించిన కేసులో జైలు పాలైన సంఘటనలో ఉన్నాయి. త్రిబుల్ ఆర్ భూనిర్వాసితులను రెచ్చగొట్టి అమాయక రైతులను జైలు పాలు చేశారు. భువనగిరి మండలానికి సంబంధించి అలైన్మెంట్ మార్పు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రస్తుత ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వాసితులకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీతో భువనగిరి ఎన్నికల సభలోను అలైన్మెంట్ మార్పు పై హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ల పై సోషల్ మీడియాలో విస్తృతంగా ఫైర్ అవుతున్నారు. అయితే అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ భూ నిర్వాసితుల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీని నిలదీసి నిర్వాసితుల ఓట్లు దండుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు భూ నిర్వాసితుల పక్షాన నిలబడడం విస్మయానికి గురి చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం భూ నిర్వాసితుల పక్కన నిలబడి అధికారం రాగానే పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.