పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను సర్వాంగ సుందరంగా ఉంచాలని ఆ దిశగా మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు.

Update: 2024-06-26 16:36 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను సర్వాంగ సుందరంగా ఉంచాలని ఆ దిశగా మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లతో మున్సిపాలిటీలలో అమలు అవుతున్న కార్యక్రమాలు, చేపట్టిన పనులు, అమృత్, ఎస్.బి.ఎం, 15 ఫైనాన్స్, పట్టణ ప్రగతి నిధుల పనులపై అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక తో కలిసి పాల్గొని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు పడుతున్నందున అన్ని మున్సిపాలిటీలలో దోమలు ఉత్పత్తి కాకుండా ఫాగింగ్, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని అలాగే వార్డులలో నిరంతర పారిశుధ్య పనులు చేపట్టాలని, సిబ్బంది డ్రెస్ కోడ్ తప్పక వినియోగించాలని సూచించారు.

అదేవిధంగా వార్డులలో ఎక్కడ కూడా సమస్యలు ఉత్పన్నమైతే సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీలలో త్రాగునీరు, స్ట్రీట్ లైటింగ్ అలాగే ఇంటి పన్ను, నీటి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు. జిల్లాలో వర్షాలు తరుచుగా పడుతున్నందున మున్సిపాలిటీలలో లోలెవల్ ప్రాంతాలను ముందుగా గుర్తించి వర్షపు నీరు, మురుగు నీరు బయటకు పంపేల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని లేనియెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో చెరువులు, రిజర్వాయర్లలో నీటిని సంవృద్దిగా నిల్వ ఉంచాలని, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందించాలని అలాగే చెరువులు కబ్జా కాకుండా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఎప్పడికప్పుడు నివేదికలు అందజేయాలని ఆదేశించారు.

నిధుల మంజూరుకు పట్టణాల్లో చేపట్టే పనులకు కలెక్టర్ అనుమతులు తప్పక తీసుకోవాలని సూచించారు. అలాగే విలీనమైన జి.పి.లకు ప్రాధాన్యత ఇవ్వాలని, నర్సరీల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నర్సరీలలో అన్ని మొక్కలు అందుబాటులో ఉండాలని సూచించారు. పట్టణాల్లో ఉన్నటువంటి పార్కుల్లో ఎప్పడికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని, వచ్చే ప్రజలకు ఆహ్లాదకరం అందించే విధంగా పార్కులు ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఇంకా పూర్తి కానీ వైకుంటదామాల పనులను చేపట్టి వివరాలు అందించాలని సూచించారు. మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా అట్టి ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.

అదేవిధంగా పట్టణంలో అనుమతుల మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా చేపట్టే నిర్మాణాలు వారంలో రెండు సార్లు తనిఖీలు చేపట్టాలని అలాగే ట్యాంక్ లలో ఎప్పడికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ హోర్డింగ్ ల నిర్వహణ, పట్టణ ప్రకృతి వనాల నిర్వహణ, ధోభీ ఘాట్ నిర్వహణ తదితర అంశాలపై ఈ సందర్భంగా సమీక్షించారు. ఎన్నికలు పూర్తి కావడంతో అన్ని మున్సిపాలిటీల్లో ప్రజాపాలన హెల్త్ డెస్క్ లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు సూర్యాపేట శ్రీనివాస్, కోదాడ రమాదేవి, హుజూర్ నగర్ శ్రీనివాస్, నెరేడుచర్ల అశోక్ రెడ్డి, తిరుమలగిరి బుచ్చిబాబు, మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News