సర్వేలు గురుకుల పాఠశాల ఖ్యాతిని కొనసాగించాలి : ఎమ్మెల్యే

సర్వేలు గురుకుల పాఠశాల ఖ్యాతిని కొనసాగించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు.

Update: 2024-06-29 14:22 GMT

దిశ, సంస్థాన్ నారాయణపురం: సర్వేలు గురుకుల పాఠశాల ఖ్యాతిని కొనసాగించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని ఉత్తమ గురుకుల పాఠశాలగా సర్వేలకు పేరు ఉందని దానిని కాపాడేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతుల కల్పనపై ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో గురుకుల పాఠశాల ఆవరణలో నిర్మించిన నూతన భవనాలను ఆయన పరిశీలించారు. భారీ స్థాయిలో నూతన భవనాలు నిర్మించి చిన్న చిన్న పనులు నిలిచిపోయినట్లు ఇప్పటివరకు తన దృష్టికి తీసుకు రాకపోవడంపై ప్రధాన ఉపాధ్యాయుని ప్రశ్నించారు.

వారం రోజుల్లో మౌలిక వసతులు అన్ని పూర్తి చేసి నూతన భవనాన్ని ప్రారంభించుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పాఠశాలలో అందిస్తున్న విద్య, పౌష్టికాహారం పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్న పలువురు విద్యార్థులు బక్క చిక్కిపోవడంపై ప్రధానోపాధ్యాయుని నిలదీశారు. పాఠశాలలో ఎలాంటి వసతులు లేకున్నా తన దృష్టికి తీసుకురావాలని సర్వేలు గురుకుల పాఠశాల ఖ్యాతి చెడిపోకుండా అందరం పనిచేయాలని సూచించారు. ఆయన వెంట సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ గుత్త ఉమాదేవి, జడ్పిటిసి వీరమల్ల భానుమతి, కాంగ్రెస్ నాయకులు ఏపూరి సతీష్, మందుగుల బాలకృష్ణ, ఉప్పల లింగస్వామి, గుత్త శేఖర్ రెడ్డి, వెనుముల శంకర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Similar News