మున్సిపాలిటీలో రెవెన్యూ లీలలు.. పైసలిస్తేనే ఫైల్ ముందుకు..
సూర్యాపేట పట్టణ పరిధిలోని కుడకుడ రోడ్డులో గల ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ ఇచ్చిన ఘటన సూర్యాపేట మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగంలో చోటుచేసుకుంది.
దిశ, సూర్యాపేట టౌన్ : సూర్యాపేట పట్టణ పరిధిలోని కుడకుడ రోడ్డులో గల ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ ఇచ్చిన ఘటన సూర్యాపేట మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగంలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి వారి దృష్టికి వెళ్లడంతో మళ్లీ వెంటనే ఆన్లైన్ నుంచి ఆ ఇంటి నెంబర్ ను తొలగించారని జిల్లా కేంద్రంలో విమర్శలు గుప్పుమంటున్నాయి.
అలాగే పట్టణ శివారులో ఇల్లు కట్టుకుందామని ఆన్లైన్లో మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు ఓ వ్యక్తి. వాటిని సంబంధిత టౌన్ ప్లాన్ అధికారులు పరిశీలించి డాక్యుమెంట్లు సరిగా లేవని తిరస్కరించారు. గట్టిగా ఆ విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని కలిసి డాక్యుమెంట్లు సరిగా ఉన్నా కూడా తిరస్కరించడం ఏమిటని ప్రశ్నించాడు. సదరు ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఓ చోట కలిసి కొంత మొత్తంలో ఇస్తే ఇట్టే పని అయిపోతుందని చెప్పాడు. అప్పటికే విసిగిపోయిన దరఖాస్తు చేసుకున్న వ్యక్తి చేసేదేమీ లేక ఒప్పందం మేరకు పైకం చెల్లించుకున్నాడు. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇలా ఉంటే ఇంటి నెంబర్ కేటాయింపు విషయానికి వచ్చేసరికి అదే సీన్ రిపీట్ అయింది. మున్సిపల్ కార్యాలయంలో అవినీతికి తావు లేకుండా చేద్దామని ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించి, పథకాలు, ఆన్లైన్ విధానాలు ప్రవేశపెట్టిన అవినీతి ఇంకా రాజ్యమేలుతుంది తప్ప తగ్గడం లేదు. ఫలితంగా జాతీయ రాష్ట్ర స్థాయిలో పలు విభాగాలు ఎన్నో అవార్డులు సాధించిన సూర్యాపేట మున్సిపాలిటీకి అవినీతి కంపు అంటుకుంది. పారదర్శకంగా పనులు చేయాల్సిన ఉద్యోగులు కొందరు మాత్రం డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా నూతనంగా నిర్మించిన ఇంటికి కేటాయించాల్సిన నెంబర్లను మున్సిపల్ రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా కేటాయిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసిన వారికి కేవలం నోటరీ డాక్యుమెంట్ ఆధారంగా ఇంటి నెంబర్లను కేటాయిస్తున్నారు. బాండ్ పేపర్ పై రాసిన దాన పత్రం ఇంటి సభ్యులు పరస్పర అంగీకారంతో రాసుకున్న పంచోటి పత్రాల ఆధారంగా కూడా ఇటీవల ఇంటి నెంబర్లను కేటాయిస్తున్నారు. ఇదంతా డబ్బులు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి కనుసైగల్లోనే నడుస్తుందని మున్సిపల్ అంతా చర్చించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కు కేటాయించిన ఇంటి నెంబర్ ను నోటరీ పంచోటి దాన పత్రాలకు కేటాయించడం ప్రశ్నగా మారింది.
పేరుకపోయిన దరఖాస్తులు..
సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు సంబంధించిన ఇంటి నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్న ఫైల్స్ ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. కొన్ని నెలల నుండి దరఖాస్తుదారులు చెప్పులు అరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వారిని పట్టించుకునేవారు కరువయ్యారు.
ఇక ఆన్లైన్లోనే కాకుండా ఆయా వార్డులకు చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నూతనంగా నిర్మించిన ఇంటికి నెంబర్ కేటాయింపు, అపాయింట్మెంట్ లో ప్లాట్ కొనుక్కున్న దరఖాస్తుదారులు ఇచ్చిన ఫైల్స్ కార్యాలయంలో మూలుగుతున్నాయి. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని ఆన్లైన్లో నమోదు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తూ యజమాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని జిల్లా ప్రజలు వాపోతున్నారు.
కాసులు ఇస్తేనే ఆన్లైన్..
సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగి పై అవినీతి ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాల్సింది పోయి కాసులు ఇచ్చేవరకు వాటిని ఆన్లైన్ లో నమోదు చేయకుండా అడ్డుకుంటున్నారంటే ఆ ఉద్యోగి ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంటి నెంబర్ కేటాయింపు విషయంలో రెవెన్యూ అధికారికి ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అండగా ఉన్నారని మీరు ఓటీంగా ఏర్పడి దరఖాస్తుదారుల నుండి మొక్కుబడి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంటి నెంబర్ కోసం రూ. 10 వేల నుంచి 50 వేల వరకు డిమాండ్ చేస్తూ ఉండటం ఒప్పందం మేరకు డబ్బులు ఇచ్చిన వారి ఫైల్ ని వెంటనే సంతకాలు చేసి ఇంటి నెంబర్ కేటాయిస్తున్నారని భారీ ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.
కొరవడిన పర్యవేక్షణ..
సూర్యాపేట జిల్లా స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుంది. మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు అవలంబిస్తున్న విషయమై పలువురి ఇంటి యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా పనులు చేయాలని ప్రభుత్వం ఉద్యోగులకు రూ. వేలల్లో జీతభత్యం చెల్లిస్తున్న కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మున్సిపాలిటీ పై దృష్టి సారించి అవినీతికి పాల్పడుతున్న వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజానీకం కోరుకుంటుంది.
ఇంటి నెంబర్ ని రద్దు చేశాము. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు.
నకిలీ డాక్యుమెంట్లు పెట్టి ఇంటి నెంబర్ కి ఫిర్యాదు చేయడంతో వారికి ఇంటి నెంబర్ ను కేటాయించాము. తర్వాత మేము విచారణ చేయగా నకిలీ డాక్యుమెంట్లు పెట్టారని మా విచారణలో తేలడంతో ఆ ఇంటి నెంబర్ ని ఆన్లైన్ నుండి రద్దు చేశారు. రెవెన్యూ శాఖలో ఇంటి నెంబర్ కోసం ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి తీసుకొస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.