student : ఎంబీబీఎస్ సీటొచ్చినా.. కూలి పనులకు !

మూడేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. వృద్ధులైన తాత - నానమ్మలు చేరదీసినా పేదరికం వెక్కిరించింది.

Update: 2024-11-06 02:35 GMT

దిశ, తుంగతుర్తి : మూడేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. వృద్ధులైన తాత - నానమ్మలు చేరదీసినా పేదరికం వెక్కిరించింది. అన్నింటినీ ఎదుర్కొని డాక్టర్ కావాలనే ఒకే ఒక లక్ష్యంతో ఆమె ముందుకు సాగింది. ఆర్థిక ఇబ్బందులతో ఓ వైపు కూలి పనులు చేస్తూనే.. మరోవైపు చదువు కొనసాగించింది. అయితే ఎంబీబీఎస్ సీట్ సాధించగలిగినా.. ఆర్థిక ఇబ్బందులతో మళ్లీ కూలీ పనులకు వెళ్లాల్సి వస్తున్నది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి పరిస్థితి ఇది. చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు మృతి చెందడంతో తాత శిగ రాములు, నానమ్మ వెంకటమ్మలు చేరదీశారు.

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు, పసునూరు ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్ వరకు చదివింది. డాక్టర్ కావాలనే లక్ష్యంతో నీట్ పరీక్షకు హాజరై దంత వైద్య కళాశాలలో సీటు పొందింది. ఆ తర్వాత మరోసారి నీట్ రాయడానికి సిద్ధమైంది. కూలి పనులకు వెళ్తూ డబ్బు కూడబెట్టింది. నానమ్మ పుస్తెలతాడును తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులతో హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నది. రేయింబవళ్లు కష్టపడి చదువుతూ మళ్లీ నీట్ పరీక్ష రాసి 507 మార్కులు పొందింది. మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. అయితే చదువు కోసం వెళ్దామంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. పుస్తకాలు, దుస్తులు, ఫీజులకు డబ్బులు లేక ఎప్పటిలాగే తాత, నానమ్మలతో కలిసి కూలి పనులకు వెళ్తున్నది. ప్రతి యేటా రూ. 1.50 లక్షల ఖర్చు ఉంటుందని, దాతలు ఆదుకోవాలని ఆమె వేడుకుంటున్నది.

Tags:    

Similar News