సీఎం కేసీఆర్ సభతో.. దేవరకొండ బీఆర్ఎస్‌లో జోష్

Update: 2023-11-01 13:51 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నిన్న దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభ ఆ ప్రాంత పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపిందని చెప్పొచ్చు. నియోజకవర్గంలో అసమతి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకులు ఉన్నప్పటికీ వాళ్లు పట్టించుకోకుండా పెద్ద ఎత్తున జనం సభకు హాజరు కావడం అందరిలో ఆశ్చర్యం కలిగించింది. స్వయంగా సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ ఈ నియోజకవర్గంలో చూడలేనంత పెద్ద స్థాయిలో ప్రజలు కదిలి వచ్చారని ప్రకటించడం పార్టీ నేతల్లో ఉత్సవాన్ని నింపింది. సుమారు 70 నుంచి 80 వేల మంది సభకు హాజరైనట్లు ఇంటలిజెన్స్ వర్గాలు కూడా పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ సభలో కేసీఆర్ అత్యంత తక్కువ సమయం మాట్లాడినప్పటికీ ఎంతో విలువైన మాటలు నియోజకవర్గానికి అవసరమైన అతి ముఖ్యమైన హామీలు ప్రకటించారు.

ముందు జరిగిన రెండు బహిరంగ సభల్లో పెద్దగా హామీలు ఇచ్చినట్లుగా లేవు. దేవర కొండ నియోజకవర్గానికి మాత్రం టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని అందులో ముఖ్యంగా సాగునీరు అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. ఆ రంగం అభివృద్ధి చెందాలంటే దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు నిపుణులు అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ ప్రాంతం నుంచే వ్యవసాయ శాస్త్రవేత్తలు వెలుగులోకి రావాలని చెబుతూ ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు దేవరకొండ ప్రాంతంలోనే ఇండస్ట్రీయల్ పార్క్ చేస్తానన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ నాయకుల అనాలోచిత కారణంగా, కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపించడం వల్ల డిండి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం ఆలస్యమైందని, రానున్న రోజుల్లో ఎన్ని సమస్యలు ఎదురైనా ఇక్కడే కూర్చుని ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇలా ఉంటే ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆజాత శత్రువు అని, ఎవరికి ఎలాంటి హాని చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని గొప్పగా చెప్పారు. అంతే కాకుండా ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన పేరింటి గిరిజన బిడ్డ రవీంద్ర కుమార్‌కు అండగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. స్వయంగా సీఎం కేసీఆర్ తమ ఎమ్మెల్యే గురించి గొప్పగా చెప్పడంతో పెద్ద ఎత్తున చప్పట్లతో ప్రాంగణమంతా దద్దరిల్లిలా నినదించారు. ఇదిలా ఉంటే అసమ్మతి నాయకులు బహిరంగ సభకు జనం రాకుండా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అంచనాలకు మించి జనం తరలిరావడం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ స్థానిక నాయకుల మరింత రెట్టింపు అయిందని చెప్పవచ్చు.

Tags:    

Similar News