మెప్మా మాయాజాలం.. ఫేక్ సంఘాలతో బ్యాంకులకు కుచ్చుటోపీ ...

మహిళా సంఘాలను చైతన్యవంతం చేసి మహిళలు ఆర్థిక స్వావలంబన

Update: 2025-01-03 01:46 GMT

దిశ,కోదాడ: మహిళా సంఘాలను చైతన్యవంతం చేసి మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు ప్రభుత్వం మున్సిపాలిటీల్లో మెప్మా ను స్థాపించింది. మెప్మాలో వార్డు వార్డుకు మహిళలను ఏకం చేసేందుకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేశారు. రిసోర్స్ పర్సన్లు సంఘాల సంఘ బంధాల పనులు చేపట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రిసోర్స్ పర్సన్ లలో కొందరు పలు రాజకీయ పక్షాల నాయకుల అండదండలతో కొనసాగుతున్నారు .ఈ నేపథ్యంలో రిసోర్స్ పర్సన్ లు కాస్త మెప్మాలో చక్రం తిప్పడం ప్రారంభించారు. కోదాడ మెప్మా కార్యాలయంలో 49 మంది రిసోర్స్ పర్సన్ లు ఉన్నారు. వీరిలో కొంతమంది రాజకీయ పక్షాల అండదండలతో బినామీ సంఘాలను ఏర్పాటు చేసి నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో రుణాలు పొందుతున్నట్లు సమాచారం. హుజూర్నగర్ రోడ్డు లోని యూనియన్ బ్యాంక్ లో 15కు పైగా ఫేక్ సంఘాలు ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట రోడ్డు లో ఉన్న మెయిన్ బ్రాంచ్ లో 20 పైగా బినామీ సంఘాలు ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విజయ బ్యాంకు లో మరికొన్ని బినామీ సంఘాలు ఉన్నట్లు సమాచారం.ఇటీవల వాటాల పంపకంలో తేడాలు వచ్చి రిసోర్స్ పర్సన్ లే స్వయంగా ఈ బినామీ భాగవతాన్ని బయటికి పొక్కించారు.

అసలు విషయం ఏమిటంటే..

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న కొందరు పట్టణ పరిధిలోని 35వ వార్డు కు చెందిన మహిళలను సమభావన గ్రూప్ గా చేసి దానికి గాంధీ సమభావన సంఘం పేరు పెట్టారు. ఈ గ్రూప్ ను ఏర్పాటు చేయడంలో మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఈ గ్రూప్ సభ్యులకు రూ.10 లక్షల రుణం మంజూరు చేయాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ సిఫార్సు చేసి నట్టు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి కోదాడ యూనియన్ బ్యాంక్ నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నారు. ఆ సమయంలో మెప్మా తరఫున ఆర్పీ గా పని చేసిన మహిళతో పాటు మహిళా ప్రజాప్రతినిధులు మిగతా సభ్యులకు తెలియకుండా, రుణాన్ని వారికి పంచకుండా కాజేశారు.

నోటీసులతో బయటపడిన కుంభకోణం...

కొద్ది రోజుల తరువాత రుణం చెల్లించాలని సంఘం సభ్యులకు బ్యాంక్ నుంచి నోటీసులు రావడం తో లబోదిబోమంటూ మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో కోదాడ ఆర్టీవో కు ఫిర్యాదు చేశారు. కుంభకోణం లో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోదాడ మెప్మా పరిధిలో పనిచేస్తున్న దాదాపు 30 మంది ఆర్పీలు నెల రోజుల క్రితం ధర్నా నిర్వహించారు. ఫోర్జరీ ఎలా జరిగిందో, దానికి బాధ్యులు ఎవరో తేల్చి చెప్పిన, అన్ని ఆధారాలను ఇచ్చిన పట్టించుకునే నాథుడే లేడని పేద మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంత జరుగుతున్న స్పందించని పాలకవర్గం....

మున్సిపాలిటీలో మెప్మా కార్యాలయం లో విభేదాలు తెరపైకి వస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ కమిషనర్ స్పందించిన పాపాన పోలేదు. ఇటీవల బాహాటంగా కొందరు సంఘ బంధం సభ్యులు రోడ్డుపైకి వచ్చారు. ఓ సంఘంలోని ఆర్పిని తొలగించాలని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ విషయం పత్రికల్లో వచ్చిన నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధిగాని మున్సిపల్ పాలకవర్గం అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఈ లెక్కన మెప్మా నుంచి లక్షల రూపాయల్లో స్వయం ఉపాధి పేరున మంజూరవుతున్న నిధుల లెక్కను బయటకు తీస్తే ఎవరు తెర వెనుక ఉన్నారు ఇట్టే బయట పడుతుందని స్థానికులు అంటున్నారు.

అధికారులు విచారణ చేస్తున్నారు : మున్సిపల్ కమిషనర్ రమాదేవి

కోదాడ మెప్మా కార్యాలయంలో తమకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో రూ.10 లక్షల రుణం తీసుకున్నారని కొందరు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. దీనిపై మెప్మా అధికారులు, సిబ్బంది విచారణ చేస్తున్నారు. నా సంతకాన్ని ఫోర్జరీ చేయలేదు కాబట్టి నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు కమిషనర్ ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తా మంటున్నారని బాధిత మహిళలు చెబుతున్నారు. తమను మోసం చేశారని బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయాలి కదా.


Similar News