ప్రవళిక ఆత్మహత్యకు సీఎం బాధ్యత వహించాలి
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనలో, నియామకాల్లో విఫలమైన కేసీఆర్ సీఎంగా కొనసాగే అర్హత లేదని తెలంగాణ తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు.
దిశ, కోదాడ: రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనలో, నియామకాల్లో విఫలమైన కేసీఆర్ సీఎంగా కొనసాగే అర్హత లేదని తెలంగాణ తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అసమర్ధ, అనాలోచిత నిర్ణయాల వల్లనే ఉద్యోగాలు రాక నిరుద్యోగులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పరీక్షలు పదేపదే వాయిదా పడుతున్నాయని, ఉద్యోగాలు నింపుతారనే నమ్మకం పోతున్నదని, భవిష్యత్తుకి భరోసా లేదనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ప్రవళిక తల్లిదండ్రుల ఆరోపణలకు కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పారు. వేలాది యువకుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో సీఎం కేసీఆర్ తన పదేండ్ల పాలనలో యువతకు చేసిన అన్యాయం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేసారు.