గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురు నిందితుల అరెస్ట్

అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.

Update: 2024-06-26 15:50 GMT

దిశ, మిర్యాలగూడ: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా పై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని అగ్రిగోల్డ్ వెంచర్ సమీపంలో కొందరు వ్యక్తులు మధ్యాహ్నం గంజాయి విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

మాచర్ల, గురజాల ప్రాంతాల నుండి కొందరు యువకులు గంజాయి, డ్రగ్స్ టాబ్లెట్లను కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో మాచర్ల మున్సిపాలిటీకి చెందిన బత్తుల వెంకటేష్, మిర్యాలగూడ పట్టణం వినోబా నగర్ కు చెందిన గుంజ శ్రీకాంత్, గాంధీనగర్ కు చెందిన ఎడవల్లి ఘని, వేముల సాయి బాబా, ముత్తిరెడ్డి కుంటకు చెందిన పురం సందీప్, రమావత్ సునీల్, సుందర్ నగర్ కు చెందిన జాదవ్ మహేష్ ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి సుమారు మూడు కేజీలు గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్స్, మూడు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

గంజాయి విక్రయించిన, కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలోనే గంజాయి విక్రయ దారులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా నిందితులను పట్టుకున్న సిఐలు సుధాకర్, వీరబాబు, నాగార్జున, ఎస్సై రవికుమార్, కానిస్టేబుల్ శ్రీను, నాగరాజు, సైదులు, వీరబాబు హోంగార్డ్ వెంకటేశ్వర్లు, సీతారాములు లను డి.ఎస్.పి అభినందించారు.

Similar News