రెవెన్యూ డివిజన్ చేయాలని.. రిలే నిరాహార దీక్ష

Update: 2023-09-14 15:36 GMT

దిశ, నాంపల్లి: నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గురువారం రెండవ రోజు జరిగిన రిలే నిరాహార దీక్షలలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పానుగంటి వెంకటయ్య గౌడ్, బీఎస్పీ నాంపల్లి మండల అధ్యక్షుడు పల్లెటి వినోద్ కుమార్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ఉప ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించి చండూర్ రెవెన్యూ డివిజన్‌కు హామీ ఇచ్చారు. ఎన్నికలలో గెలవడంతో చండూరును కొత్త రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించి నాంపల్లి మండలాన్ని అందులో కలుపుతున్నట్లు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి మండలాని రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిలపక్షాల నాయకులు, నాంపల్లి రెవిన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా వివిధ రూపాలలో ఉద్యమం కొనసాగిస్తున్నారు.

నాంపల్లి అభివృద్ధి పట్ల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఏ మాత్రం చొరవ చూపడం లేదని.. వివక్ష చూపిస్తున్నారన్నారు. నాంపల్లిలో ఒక్క డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదని, బస్టాండు అతి గతి లేదన్నారు. నాంపల్లి మండలం అభివృద్ధి సాధించాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అఖిలపక్షాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ డివిజన్ సాధన కోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కలిసి రావాలి, లేదంటే రాబోవు ఎన్నికల్లో ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ సర్పంచ్ కోట్ల నరసింహ, రాందాస్ తండా మాజీ సర్పంచ్ సభావత్ జమ్లా నాయక్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నాంపల్లి సతీష్, సైదులు, కామనబోయిన యాదయ్య ముదిరాజ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సింగారపు గిరి ముదిరాజ్, రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.


Similar News