పత్రికా స్వేచ్ఛ అందరి బాధ్యత.. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి..
పత్రికా స్వేచ్ఛను కాపాడడం ప్రజాస్వామ్యవాదులు ప్రజలందరి బాధ్యత అని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు.
దిశ, నల్లగొండ బ్యూరో : పత్రికా స్వేచ్ఛను కాపాడడం ప్రజాస్వామ్యవాదులు ప్రజలందరి బాధ్యత అని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లాకు మొదటిసారి విచ్చేసిన సందర్భంగా ఎన్.జి.కాలేజీలో నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. జాతీయ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రోజు నుంచి జాతీయ పత్రికా దినోత్సవం రోజుగా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రిక అంతర్భాగమని పేర్కొన్నారు.
పత్రిక దినోత్సవం అని అందరూ పాటించాల్సిందేనన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా అవసరం అన్నారు. మనదేశంలో పత్రికా స్వేచ్ఛ అమ్మనుగడకు కొంత ఆటంకం కలిగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తులు చేశారు. గత రెండు వారాల్లోని మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇద్దరు జర్నలిస్టులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరు ఖండించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే పత్రిక స్వేచ్ఛ ఉండాల్సిందేనన్నారు. ఒకవేళ పత్రికా స్వేచ్ఛ లేకపోతే నిరంకుషానికి దారితీస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పత్రిక రంగంలో ఉన్న జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.