జిల్లాలో హాట్ టాపిక్‌గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ఎవరికి నష్టం.. ఎవరికి లాభం?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

Update: 2024-11-16 02:40 GMT

దిశ నల్లగొండ బ్యూరో/నకిరేకల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో కేవలం అధికారులు మాత్రమే విచారణ ఎదుర్కొని జైలు జీవితం గడుపుతున్నారు. కానీ, తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు అందడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆయనతో పాటుగా నల్లగొండ జిల్లాలో మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, పైళ్ల శేఖర్ రెడ్డి, నల్లబోతు భాస్కరరావు‌లకు సైతం నోటీసులు అందాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో నెలకొంది.

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం..

జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తున్నందుకే తనపై కేసులు పెట్టేందుకు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అంబుజా సిమెంట్ కంపెనీని వ్యతిరేకిస్తున్నందుకు ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి తనని ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని సీఎంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ టాపింగ్ వ్యవహారం చేశారని. గత ఎన్నికల్లో తనను ఓడగొట్టేందుకు తన ఫోన్ టాపింగ్ చేశారని అదేవిధంగా వెపన్ పెట్టి తనను బెదిరించారని విషయాన్ని ఒక్కసారిగా వెల్లడించడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.

ఎవరికి లాభం.. ఎవరికి నష్టం

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకోవడం వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి అనే చర్చ జిల్లాలో కొనసాగుతోంది. ఒకవైపు ఎమ్మెల్యే వేముల వీరేశం కేటీఆర్‌పై విమర్శలు గుప్పించడంతో మొన్నటి వరకు అదే పార్టీలో కొనసాగారని ప్రస్తుతం ఆయనపై ఇంత ఘాటుగా విమర్శలు ఎందుకు చేశారు అనే వాదన ఒకవైపు వినిపిస్తోంది. దీనికి తోడు గతంలో ఎమ్మెల్యేగా కేటీఆర్ వెంటే ఉంటూ గత ఎన్నికల ముందు కూడా టికెట్ కోసం ప్రయత్నించారని కానీ ప్రస్తుతం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో విధంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం‌ను ప్రోత్సహిస్తూ జిల్లాలో తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ఈ ఎత్తుగడ వేసారని అపవాద కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన ప్రాబల్యాన్ని నియోజకవర్గంలో చాటుకోవడంతో పాటుగా జగదీశ్‌రెడ్డికి అండగా ఉండేందుకు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి‌పై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. దీనికి తోడుగా గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అనుచరుడిగా ఉన్నటువంటి లింగయ్య ద్వారా సీఎం రేవంత్‌రెడ్డికి చెక్ పెట్టే ఆలోచన ఏమైనా జరుగుతుందా అనే చర్చ సైతం వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి ఆరోపణల వెనుక నిజమెంత అబద్ధం ఎంత అనేది తెలియాలంటే మరింత సమయం వేచి చూడాల్సిందే.

నిస్సహాయ స్థితిలో బీఆర్ఎస్ కేడర్..

ఇప్పటికే ఓటమిపాలై జిల్లాలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కేడర్ ప్రస్తుత జరుగుతున్న పరిణామాలతో నిస్సహాయ స్థితిలోకి వెళ్లారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. తమ అగ్ర నాయకులు ఏదో ఒక కేసులో ఇరుక్కుని జైలు జీవితం గడుపుతే తమ పరిస్థితి ఏంటనేది తమ ఆవేదన వెలుబుతున్నారు. ఒకవేళ ఇదే పార్టీలో కొనసాగాలా లేక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలా అనే ఆలోచనలు సైతం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అధికారం ఉండటం వల్ల తమకు అధికారం ఉంది మంత్రుల అండలు ఎమ్మెల్యేల అండదండలు ఉన్నాయని ఆనందంగా ఉంటున్నారు. కానీ, జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ క్యాడర్ ఉండడం కూడా ఒక అంత వారికి లాభం అని చెప్పవచ్చు. జగదీశ్‌రెడ్డి పదేళ్ల పాటు జిల్లా మంత్రిగా వ్యవహరించినప్పటికీ బీఆర్ఎస్ క్యాడర్ పెద్దగా ఆయనకు అండగా ఉండరు. ఈ వ్యవహారాలన్నీ ఇలాగే కొనసాగుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తమ నాయకులు జైలు జీవితం కడితే తమ రాజకీయ జీవితం కోల్పోయినట్టునని కొంతమంది నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు అన్నింటిని మరికొంత కాలం వేచి చూస్తే తప్ప వీటికి ముగింపు ఏంటి అనేది తెలియాలి.


Similar News