సెలవులో ఉన్నా జీతం !

ప్రభుత్వానికి వారు కళ్ళు, ముక్కు, చెవులు. ఏ సంక్షేమ పథకం గ్రామాల్లో అమలు కావాలన్నా..

Update: 2024-10-23 03:39 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : ప్రభుత్వానికి వారు కళ్ళు, ముక్కు, చెవులు. ఏ సంక్షేమ పథకం గ్రామాల్లో అమలు కావాలన్నా.. పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా వారి సహకారం తప్పనిసరి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న అధికారులెవరో కాదు గ్రామ పంచాయతీ కార్యదర్శులు. ఎంతో గురుతర బాధ్యత గల ఈ అధికారుల్లో కొంతమంది సెలవులో ఉన్నా కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పూర్తి జీతాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మండలానికి ఏ ఉద్యోగి రావాలన్నా సుముఖత చూపకపోవడం, ఉన్న కార్యదర్శులు వివిధ కారణాలతో దీర్ఘకాలిక సెలవులు పెట్టుకోవడంతో సిబ్బంది కొరత ఉన్నదని సమాచారం. పంచాయతీ కార్యదర్శులు దీర్ఘకాలిక సెలవులలో ఉండటం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న  గ్రామ పంచాయతీతో పాటు అదనపు బాధ్యతలు స్వీకరించి మరొక గ్రామపంచాయతీకి ఇంచార్జ్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరంలో పంచాయతీ కార్యదర్శులకు 15 రోజులు క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. వివిధ కారణాల వలన ఒక కార్యదర్శి దీర్ఘకాలిక సెలవు పెట్టుకుంటే 28 రోజుల వరకు ఆ పంచాయతీ కార్యదర్శిని విధుల్లోకి తీసుకునే అధికారం ఎంపీడీఓకు ఉంటుందని సమాచారం. 28 రోజులు పైగా సెలవులో ఉంటే డీపీఓ ఆదేశాల మేరకు ఆర్డర్ తీసుకుని విధుల్లో చేరాలి.

ఇదే అదునుగా భావించి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ మండలంలో కొందరు గ్రామ కార్యదర్శులు దీర్ఘకాలిక సెలవులు పెట్టుకొని వెళ్లినట్లు సమాచారం. 28 రోజుల వరకు ఆ పంచాయతీ కార్యదర్శిని విధుల్లోకి తీసుకునే అధికారం ఎంపీడీఓకు ఉంటుందనే సాకుతో ఆ మండలంలోని కొంత మంది అధికారులను మచ్చిక చేసుకొని సెప్టెంబర్ 5 తారీఖు నుంచి ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి సెలవు పెట్టుకోవడంతో ఆ మండలంలోనే వేరే గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న మరో కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి వరుసగా 10 రోజులకు పైబడి సెలవులో ఉంటే ఆ రోజుల జీతం సాధారణ జీతం బిల్లుతో కలిసి చేయరాదని ప్రభుత్వ నిబంధన. ఆ ఉద్యోగి తన దీర్ఘకాలిక సెలవు ముగిసిన తరువాత అతని సెలవుల అర్హత, నిలువను బట్టి సెలవు మంజూరు చేసి అప్పుడు వేతన బిల్లు చేయాలి. అసలు కధ ఇక్కడే మొదలైయింది. సెలవు పై వెళ్లిన అధికారి మళ్ళీ సెప్టెంబర్ 20 తారీఖున విధులలో జాయిన్ అయ్యి మళ్ళీ సెలవు పెట్టుకున్నప్పటికీ ఆ కార్యదర్శికి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పూర్తి జీతం అక్టోబర్ 2024 నెలలో వచ్చినట్లు ఆయనతో పాటు దీర్ఘకాలిక సెలవులు పెట్టుకున్న ఇతర పంచాయతీ కార్యదర్శులే గుసగుసలాడుకుంటున్నారు. ఆ నోట ఈ నోట పడి మండలంలోని ఉద్యోగస్తులందరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నా జీతం !!" ఎలా చేశారని చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేట జిల్లాలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల రికార్డులను ఈ మధ్య క్షుణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందువల్ల గతంలో వివిధ గ్రామ పంచాయతీల నుంచి వివిధ అవినీతి, అక్రమ ఆరోపణలతో ఇతర గ్రామాలకు బదిలీ పై వెళ్లిన కొందరు పంచాయతీ కార్యదర్శులు గతంలో విధులు నిర్వహించిన గ్రామ పంచాయతీల రికార్డులను కూడా క్షుణంగా పరిశీలించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. దీర్ఘకాలిక సెలవులో ఉన్నా జీతం తీసుకున్నరనే ఆరోపణలు వస్తున్న పంచాయతీ కార్యదర్శితో పాటు ఆయనకు సహకరించిన అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ప్రభుత్వం నిధులు దుర్వినియోగం జరగకుండా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు చూడాలని పలువురు కోరుకుంటున్నారు.

వివరణ..

తప్పు జరిగితే అధికారుల పై చర్యలు ఉంటాయంటున్నారు సూర్యాపేట డీపీవో నారాయణ రెడ్డి. అలాగే ఇలాంటి తప్పులు జరిగితే సంబంధిత మండల అధికారులు బాధ్యులు అవుతారని చెబుతున్నారు.


Similar News